తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని ఉత్తర కోస్తాంద్రా, యానాంలలో భారీ వర్షాలు పడతాయని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. 

తెలంగాణలో..
ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో..
బుధ, గురు, శుక్ర వారాల్లో ఉత్తర కోస్తాంద్రా, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.