ఒక్క ఛాన్స్ అని నమ్మించి... యువతను రోడ్లపాలు చేసిన జగన్: ప్రత్తిపాటి
ఒక్క ఛాన్స్ అన్న మాట నమ్మిన పాపానికి యువతను రోడ్డున పడేసిన ఘనుడు సీఎం జగన్ అని ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. 2019 ఎన్నికలకు ముందు జగన్ అమలు చేయలేని హామీలిచ్చి యువతతో ఓట్లు వేయించుకొని మోసం చేశారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతితో పాటు రకరకాల హామీలిచ్చి వంచన చేసిన మోసగాడు జగన్ అని విమర్శించారు. అందుకే ఈసారి రాష్ట్రంలో యువత తొలిసారిగా వేసే ఓటు దేశ, రాష్ట్ర గతిని మార్చేదిగా ఉండాలన్నారు ప్రత్తిపాటి. ఆ దిశ గా రాష్ట్ర గతిని మార్చగల నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాత్రమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో టీఎన్‌ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాటి హాజరయ్యారు. తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి, జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు జగన్ చేసిన ద్రోహంపై తీవ్రస్థాయిలో చురకలు వేశారు ప్రత్తిపాటి. రానున్న ఎన్నికల్లో యువ ఓటర్లందరూ ప్రగతి, యువత భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయాలని కోరారు. ఓటు హక్కుతో దేశ, రాష్ట్ర భవిష్యత్తునే కాకుండా మన భవిష్యత్తు కూడా ఏవిధంగా ఉండాలో నిర్ణయించుకునే సువర్ణ అవకాశం ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజకీయా పార్టీలను ముందుండి నడిపించే స్థాయికి యువత ఎదగాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. యువతతోనే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అదే సమయంలో తెదేపా-జనసేన ప్రభుత్వం వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తమ భవిష్యత్తు కావాలంటే తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, జగన్ పోవాలని యువత మొత్తం కోరుకుంటున్నారని అన్నారు. మా భవిష్యత్తు మారాలనే ఆలోచనలో యువత ఉందన్నారు. అందుకే తెదేపా, జనసేన ఎక్కడ సభలు పెట్టినా యువత ముందు ఉంటున్నారని వెల్లడించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌కు యువత బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు ప్రొఫెషనల్స్ విభాగం కన్వీనర్ తేజస్విని పొడపాటి 2024లో జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్రానికి చాలా కీలకమమన్నారు. రాబోయే ఎన్నికలు రెండు పార్టీల మధ్యనో.. రాజకీయ పార్టీల నాయకుల మధ్యనో కాదని.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అనేక రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్, యువతతో పాటు ప్రతిఒక్కరూ ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తొలిసారి ఓటు వేయబోతున్న యువత నిర్ణయం చాలా కీలకం కాబోతుందని వ్యాఖ్యానించారు. తర్వాత మాట్లాడిన జనసేన స్థానిక నాయకుడు తోట రాజా రమేష్ భవిష్యత్తులో తమకు ఎవరు ఉన్నత భవిష్యత్తు కల్పిస్తారు, ఉద్యోగ భద్రత ఎవరు కల్పిస్తారనే దానిపైనే రాష్ట్ర యువత మొత్తం ఆలోచన చేస్తోందన్నారు. ప్రస్తుతం జగన్‌రెడ్డిపై ఎంత అపనమ్మకం ఉందో యువత మాటల్లోనే స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ప్రతి విద్యార్థితో మమేకమై మేము వస్తే ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి జగన్‌రెడ్డి దగా చేశారని విమర్శించారు. ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ అవకాశాలు లేక మద్యం, గంజాయి మత్తులో యువత ఉందన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగాలు రాలేదు కానీ రాష్ట్రం నుంచి గంజాయి మాత్రం ఎగుమతి అవుతోందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వస్తేనే సాధ్యమని యువత మొత్తం భావిస్తోందన్నారు.
Share this article in your network!