చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులకు సూచించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని జాతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సంస్థ (NIMSME)లో మిషన్ వాత్సల్య, సాక్ష్యం అంగన్వాడి, మిషన్ శక్తి పథకాల అమలు పురోగతిపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు, దాడులు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న చిన్నారులు, అనాథలు, నిరాశ్రయులకు భద్రత కల్పించడంలో మిషన్ వాత్సల్య కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చిన్నారులపై దాడులు, వేధింపుల ఘటనల్లో అధికారులు వెంటనే స్పందించి బాధితులకు అవసరమైన సహాయం, కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలన్నారు. మహిళల భద్రత, సాధికారత కోసం మిషన్ శక్తి కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో పెద్దపల్లి జిల్లా ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించిన మంత్రి, తెలంగాణను జీరో చైల్డ్ మ్యారేజెస్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేసి మహిళలు, చిన్నారుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి సీతక్క




