Monday, July 13, 2026

పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : కిషన్​ రెడ్డి

Must read

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డికి రహస్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబం నుంచి లక్ష కోట్ల రూపాయలు వసూలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అక్రమాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కిషన్‌రెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ సంస్థలు లేవా? లేక విచారణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులను విమర్శించే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

సోమవారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సింగరేణి భరోసా యాత్ర’ చేపడుతున్నట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ యాత్రలో బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు.

కాచిగూడ డివిజన్‌లో నిర్వహించిన పాదయాత్ర అనంతరం మాట్లాడిన కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి శనివారం, ఆదివారం బస్తీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో బస్తీలను సందర్శించిన సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అనేక రహదారులు దెబ్బతిన్నాయని, వీధిలైట్లు పనిచేయక బస్తీలు చీకట్లో మగ్గుతున్నాయని చెప్పారు. పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు.

తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. వర్షాకాలం వచ్చినప్పటికీ చివరి బస్తీలు, ఇళ్ల వరకు తాగునీరు అందడం లేదని, దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇళ్ల నిర్మాణం, పెన్షన్ల మంజూరుపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలాకాలమైనా అర్హులకు పెన్షన్లు అందడం లేదని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు రూ.4,000 భృతి, యువతులకు స్కూటీలు, వివాహ సమయంలో తులం బంగారం వంటి హామీలను ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్ అభివృద్ధిపైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్‌రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైటెక్ సిటీ అభివృద్ధికే పరిమితమైందని ఆరోపించారు. సికింద్రాబాద్, అంబర్‌పేట్, సనత్‌నగర్, గౌలిగూడ, ఓల్డ్‌సిటీ, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికారులు వెంటనే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!