Saturday, June 20, 2026

‘లగాన్’కు 25 ఏళ్లు.. సినిమాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సచిన్

Must read

భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘లగాన్’ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో తన వంతుగా చిన్న సహాయం చేసినట్లు వెల్లడించారు. దర్శకుడు అశుతోశ్ గోవారికర్ సినిమా విడుదలకు రెండేళ్ల ముందు తనను కలిశారని, క్రికెట్ మ్యాచ్ సమయంలో ప్రేక్షకుల అరుపులు, స్టేడియం వాతావరణానికి సంబంధించిన సహజమైన సౌండ్ కావాలని అడిగారని తెలిపారు. ఆ సమయంలో ముంబై వాంఖడే స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండటంతో అక్కడికి వచ్చి ఆ శబ్దాలను రికార్డ్ చేసుకోవాలని సూచించినట్లు సచిన్ తెలిపారు. ‘లగాన్’ సినిమా తన కుటుంబంలోనూ ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయిందని చెప్పారు. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ చిన్నప్పుడు ప్రతిరోజూ క్రికెట్ ఆడి ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తూ ఈ సినిమాను చూసేవాడని, కుటుంబమంతా ఎన్నిసార్లు చూసినా కొత్త అనుభూతినే ఇచ్చిందని తెలిపారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరింత ప్రాణం పోసిందని, ముఖ్యంగా ‘ఓ పాలన్‌హారే’ పాట ఎంతో ప్రశాంతతను, సానుకూల భావనను కలిగిస్తుందని ప్రశంసించారు. 25 ఏళ్ల ప్రయాణం పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమిర్ ఖాన్, అశుతోశ్ గోవారికర్‌తో పాటు చిత్ర బృందానికి సచిన్ అభినందనలు తెలిపారు. 2001లో విడుదలైన ‘లగాన్: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా’ చిత్రానికి అశుతోశ్ గోవారికర్ దర్శకత్వం వహించగా, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మించారు. బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేషన్ సాధించి భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!