విద్యా సంస్థలు ఇప్పట్లో ఓపెన్ కావడం కష్టమేనా..?
తెలంగాణలో కరోనా కారణంగా సంక్రాంతి సెలవులు ముందే ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా స్పీడ్ పెంచుతూ ఉండటంతో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఈ సెలవులను మరో నాలుగు రోజులపాటు పొడగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 20వ తేదీ వరకు ఆంక్షలను పొడిగించిన సర్కార్ అప్పటి వరకు విద్యా సంస్థలకు కూడా సెలవులను పొడిగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు కూడా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓ నివేదికకు సమర్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. అందుకే ఆంక్షలను పొడిగించిన సర్కార్ ఈ ప్రభావంతో కేసులు తగ్గుతాయని భావిస్తోంది. అలాగే అప్పటి వరకు విద్యా సంస్థలను కూడా తెరవకుండా ఆదేశించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా సంస్థలను మళ్ళీ 17న ఓపెన్ చేస్తే పండగ సందర్భంగా అటు, ఇటు రాకపోకలు జరపడం వలన కరోనా మరింత స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే సెలవులను పొడిగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Share this article in your network!