భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక కొత్త ప్రధాని
శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమ సింఘే భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో భారత్ ఆర్థిక సాయం చేసి ఆదుకుందని గుర్తు చేశారు. యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ)కి చెందిన ఆయన నిన్న ఆ దేశ 26వ ప్రధానిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. భారత్ తో అత్యంత సన్నిహిత సంబంధాలను తాను కోరుకుంటున్నానని చెప్పారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశాన్ని బయటపడేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఈ సమస్యను తీర్చి దేశంలో పెట్రోల్, డీజిల్, విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తానన్నారు. అవసరమైతే నిరసనకారులతో మాట్లాడుతానని, వాళ్లను ఎదుర్కొంటానని చెప్పారు. ఆర్థిక సంక్షోభం వంటి తీవ్ర సమస్యనే ఎదుర్కోగా లేనిది.. వారిని ఎదుర్కోలేనా? అని అన్నారు.
కాగా, శ్రీలంక కష్టాల్లో ఉండగా భారత్ 300 కోట్ల డాలర్లు సాయం చేయడంతో పాటు బియ్యం, డీజిల్, వంటి అత్యవసరాలనూ పంపించింది.
Share this article in your network!