పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని డిమండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు తెలంగాణ ఆప్ నేతలు. ఇందిరా శోభన్ నేతృత్వంలో నిరసన తెలిపిన ఆప్ నాయకులూ… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడే ఉన్నారని తెలియడంతో ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. 

ఈ నేపథ్యంలో ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అప్పుడే బయటకు వచ్చి వెళ్తుండగా…ఇందిరా శోభన్ సివంగిలా ముందుకు దూసుకెళ్ళి మంత్రి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఇందిరా శోభన్ మోచేతికి స్వల్ప గాయమైంది. నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ.. ప్రజల సమస్యలను వినేందుకు సమయం కేటాయించని మంత్రులు ఉంటె ఎంత లేకుంటే ఎంత అన్నారు ఇందిరా శోభన్. బీజేపీ గుండాయిజం చేస్తే ఎవరూ భయపడరని…ప్రజాస్వామ్యయుతంగా నూతనోత్సాహంతో మరింత పట్టుదలతో ముందుకు సాగుతామని హెచ్చరించారు. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఎంత అణచివేయాలని ప్రయత్నిస్తే అంతకుమించిన రెట్టించిన ఉత్సాహంతో ప్రజల తరుఫున ఉద్యమిస్తామన్నారు.