ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, కొత్త చేరికలను సమన్వయం చేసేందుకు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాచరణ ప్రారంభించారు.తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుగ్గా నిర్వహించేందుకు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరాలనుకునే నాయకులను సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన తెలంగాణ జాయినింగ్స్ కమిటీని అధికారికంగా నియమించారు.జనసేన భావజాలం, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్న విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు, మాజీ అధికారులు, యువ నాయకులు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే చేరికల ప్రతిపాదనలను పరిశీలించి పార్టీ అధిష్టానానికి నివేదిక అందించనుంది.
తెలంగాణ జాయినింగ్స్ కమిటీ సభ్యులు:
ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
డా. గడల శ్రీనివాస్ (తెలంగాణ రాష్ట్ర మాజీ మెడికల్ డైరెక్టర్)
గొట్టిముక్కల నరేష్ రెడ్డి
అబ్దుల్ హనీఫ్
అల్లాడి తనీష్ (సినీ నటుడు)
చిరాగ్ ప్రజీత్ గౌడ్
మేడూరి సరస్వతి (తెలంగాణ రాష్ట్ర మాజీ డీసీపీ)
తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. వివిధ జిల్లాల నుంచి వస్తున్న చేరికల విజ్ఞప్తులను ముందుగా కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. నాయకుల నేపథ్యం, ప్రజల్లో ఉన్న గుర్తింపు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాత నివేదిక సిద్ధం చేయనున్నారు.ఈ నివేదికలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పరిశీలించి, తుది నిర్ణయం కోసం అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ సూచనలు, మార్గదర్శకాల ప్రకారం త్వరలో హైదరాబాద్ వేదికగా భారీ స్థాయిలో చేరికల కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణలో పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించడం, బలమైన నాయకత్వాన్ని తయారు చేయడం లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో జనసేన భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది.




