Friday, June 26, 2026

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి అచ్చెన్న

Must read

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకులకు ఈ నియామకాల ద్వారా సముచిత గౌరవం లభించిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

టీడీపీ అత్యున్నత నిర్ణయాధికార వేదిక అయిన పొలిట్‌బ్యూరోలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు కీలక స్థానం లభించింది. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, కష్టకాలంలో పోషించిన పాత్రకు గుర్తింపుగానే ఈ పదవి దక్కినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అదే విధంగా కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. యువ నాయకుడిగా రామ్మోహన్ నాయుడు జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్ఠను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడుకు జాతీయ అధికార ప్రతినిధి పదవి అప్పగించారు. పార్టీ కష్టకాలంలో ఎలాంటి పదవులు ఆశించకుండా క్రమశిక్షణతో పని చేయడం ఆయనకు ఈ గుర్తింపును తీసుకువచ్చిందని చెబుతున్నారు.

రాష్ట్ర స్థాయి కమిటీల్లో కూడా జిల్లాకు చెందిన పలువురు నేతలకు ప్రాధాన్యం లభించింది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించగా, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

అలాగే ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన తమ్మినేని సుజాతను రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్కు జోనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.

రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా పలాసకు చెందిన వజ్జ బాబూరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె బగ్గు అర్చనలను నియమించారు. అలాగే పాతపట్నం నియోజకవర్గానికి చెందిన పొగిరి బుచ్చిబాబు, శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన మాదారపు వెంకటేష్ రాష్ట్ర కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ నియామకాలతో శ్రీకాకుళం జిల్లా టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. జిల్లా నాయకత్వానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అధిక ప్రాధాన్యం లభించడం వల్ల పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!