Friday, June 26, 2026

టర్కీ పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది మృతి

Must read

టర్కీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థి తనే చదువుతున్న పాఠశాలలో కాల్పులకు తెగబడి పలువురి ప్రాణాలు తీశాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడైన విద్యార్థి కూడా మరణించాడు.

టర్కీలోని కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లో ఉన్న అయ్సెర్ కాలిక్ మిడిల్ స్కూల్‌లో జరిగింది ఈ ఘటన. 8వ తరగతి చదువుతున్న ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి తన తండ్రికి చెందిన తుపాకులను తీసుకుని పాఠశాలకు వెళ్లాడు. మొత్తం ఐదు తుపాకులతో స్కూల్‌లోకి ప్రవేశించిన అతడు ముందుగా ఒక తరగతి గదిలోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం మరో తరగతి గదిలోకి వెళ్లి మళ్లీ కాల్పులు కొనసాగించాడు.

ఈ కాల్పులతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. పాఠశాల ఆవరణ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. కొద్ది నిమిషాల్లోనే ఎనిమిది మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 13 మంది విద్యార్థులను సమీప ఆసుపత్రులకు తరలించగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్త్సీ వెల్లడించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే నిందితుడైన విద్యార్థి కూడా మరణించినట్లు తెలుసుకున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేక పోలీసుల చర్యల్లో మృతి చెందాడా అన్న విషయంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన టర్కీ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. పాఠశాలలో భద్రతా వ్యవస్థలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. చిన్న వయసులోనే ఒక విద్యార్థి ఇంతటి దారుణానికి పాల్పడటంపై ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ పరిస్థితులు, మానసిక ఒత్తిడి, సమాజ ప్రభావం వంటి అంశాలు ఇలాంటి ఘటనలకు కారణమవుతాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!