అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు హైదరాబాద్ మరోమారు ముస్తాబైంది. ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండగ కోలాహలంగా జరగనుంది. ఇందులో 16 దేశాలకు చెందిన 40 మంది, మన దేశం నుంచి 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు పాలుపంచుకుంటారు. మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పండుగ కోసం పర్యాటక శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 

కైట్ ఫెస్టివల్‌తోపాటు స్వీట్ ఫెస్టివల్‌ను కూడా అదే గ్రౌండ్స్‌లో దానితో పాటే నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ మిఠాయిలు స్టాల్స్‌లో అందుబాటులో ఉంచుతారు. దీంతోపాటు హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో ప్రవేశం పూర్తిగా ఉచితమని, అందరూ సందర్శించాలని ప్రభుత్వం కోరింది.