తెలంగాణలో పేదల భూములను కొల్లగొట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆ వ్యూహంలో భాగంగానే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి భూములపై అక్రమాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో 22ఏ భూముల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ధరణి పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకున్నారని పొంగులేటి ఆరోపించారు. ధరణి విధానంతో పేదలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ధరణి వల్ల పింక్ కలర్ చొక్కాలు వేసుకున్న వారికే ప్రయోజనం కలిగిందని విమర్శించారు. ధరణిలో చోటుచేసుకున్న అక్రమాలు, భూ సమస్యల కారణంగా పలువురు రైతులు తీవ్రంగా నష్టపోయారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో జరిగిన విధ్వంసం చిన్నది కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 22ఏ పేరుతో పేదల భూములను పదేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గత పదేళ్లలో సాధారణ ప్రజల భూములను కాపాడటం కంటే కొందరు పెద్దలు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఆస్తులను పెంచుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. రెవెన్యూ శాఖ కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసైగల్లోనే పనిచేసిందని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ రెవెన్యూ శాఖను తన వద్దే ఉంచుకున్నారని ఆయన గుర్తుచేశారు.
లాక్ సిస్టమ్‌తో అక్రమాలు దాచారని ఆరోపణ
ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా లాక్ సిస్టమ్‌ను తీసుకొచ్చారని పొంగులేటి ఆరోపించారు. భూముల లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటకు కనిపించకుండా ఈ విధానాన్ని ఉపయోగించారని విమర్శించారు. ధరణి చట్టాన్ని తీసుకొచ్చిన సమయంలో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయలేదని మంత్రి స్పష్టం చేశారు. భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
వీఆర్ఏ, వీఆర్‌ఓ వ్యవస్థల రద్దుపైనా విమర్శలు
వీఆర్ఏ, వీఆర్‌ఓ వ్యవస్థలను రద్దు చేయడం ద్వారా గ్రామాల్లో రెవెన్యూ పరిపాలనకు ఇబ్బందులు ఏర్పడ్డాయని పొంగులేటి విమర్శించారు. ధరణిలో భూ సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించే వ్యవస్థ కూడా లేకుండా చేశారని ఆరోపించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పేదలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఉంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో పేదల భూములు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.


