బ్రిక్స్-2026 సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 12) న్యూఢిల్లీలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రారంభ ప్రసంగం చేశారు. ప్రజలే కేంద్రంగా, మానవత్వమే ప్రధాన ఎజెండాగా బ్రిక్స్ దేశాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.తమ విధానం ఏ దేశానికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అన్ని దేశాలను కలుపుకుని ముందుకు సాగడమే తమ ఎజెండా అని తెలిపారు. పరస్పర సహకారం, విశ్వాసం, సమన్వయంతో బ్రిక్స్ మరింత బలోపేతం కావాలని బ్రిక్స్ సభ్య దేశాలను కోరారు.
బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ వేదిక గత రెండు దశాబ్దాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇప్పటివరకు సాధించిన పురోగతిని కొనసాగిస్తూ, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రపంచ పాలనలో గ్లోబల్ సౌత్‌కు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్ మాదిరిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పై స్థాయిలో ఉన్న కొన్ని దేశాలు అధికారం, నిర్ణయాలను ప్రభావితం చేస్తుండగా, దిగువన ఉన్న అనేక దేశాలు ఆ నిర్ణయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అయితే నిర్ణయాలను మార్చడం లేదా ప్రభావితం చేయడంలో ఆ దేశాలకు పరిమితమైన పాత్ర మాత్రమే ఉంటోందని పేర్కొన్నారు.
ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని గ్లోబల్ సౌత్ దేశాలు ముందుగా ఎదుర్కొంటున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మాత్రం వెనుకబడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ వ్యవస్థలో సమతుల్యత తీసుకురావడానికి గ్లోబల్ సౌత్‌ను నియమాలను రూపొందించే ప్రక్రియలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.బ్రిక్స్‌లో తీసుకునే నిర్ణయాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వాటి అమలును పర్యవేక్షించే వ్యవస్థ అవసరమని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. బ్రిక్స్ అధ్యక్ష పదవి నిర్వహించే దేశాల సమన్వయంతో పనిచేసే ట్రోయికా ద్వారా కార్యక్రమాలు, నిర్ణయాల అమలును పర్యవేక్షించవచ్చని సూచించారు.
అదే విధంగా బ్రిక్స్ కోసం సురక్షితమైన డిజిటల్ రిపోజిటరీని ఏర్పాటు చేయవచ్చని మోదీ అన్నారు. అందులో ప్రతి నిర్ణయంతో పాటు సంబంధిత నోడల్ పాయింట్, అమలుకు నిర్దేశించిన కాలపరిమితి, ప్రస్తుత అమలు స్థితి వంటి వివరాలను నమోదు చేయవచ్చని సూచించారు. దీనివల్ల నిర్ణయాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.బ్రిక్స్‌ను మరింత బలోపేతం చేస్తూనే ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణలకు మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే 20 సంవత్సరాల కోసం కొత్త, ప్రతిష్టాత్మకమైన అజెండాపై సభ్య దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
బ్రిక్స్ అధ్యక్ష పదవి ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, సంస్థాగత వేగం మాత్రం తగ్గకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భవిష్యత్ సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటూ, ప్రజల సంక్షేమం, మానవత్వం, సమాన భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా బ్రిక్స్ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.


