భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల SIR అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి సమానమైన ఓటు హక్కు కల్పించారని, గుడిసెల్లో నివసించే వ్యక్తి అయినా, లక్షల కోట్ల ఆస్తులు కలిగిన వ్యక్తి అయినా ఓటు విలువ ఒక్కటేనని అన్నారు. దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో గత 77 ఏళ్లుగా ఓటర్ల జాబితాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, కొందరు ఓటు హక్కు కోల్పోగా మరికొందరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు చర్యలు చేపట్టారని చెప్పారు. అయితే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు SIR ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, వారి యంత్రాంగం ఉన్న సమయంలో బీజేపీ ఓట్లు తొలగిస్తుందనే ఆరోపణలు చేయడం అర్థరహితమని అన్నారు. గతంలో దొంగ ఓట్ల ఆధారంగా ఎన్నికల్లో లబ్ధి పొందిన విధానాలకు అడ్డుకట్ట పడుతుందనే భయంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు.
ఓటు హక్కుతోనే దేశ భవిష్యత్తును మార్చగలం: ఎంపీ ఈటల రాజేందర్




