Thursday, June 18, 2026

వెన్నుపోటుకు పేటెంట్ హక్కుదారుడు జగన్‌ : అచ్చెన్నాయుడు

Must read

రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. వెన్నుపోటుకు కర్త, కర్మ, క్రియ జగన్‌నేనని, ఆ పదానికి పేటెంట్ హక్కులు ఎవరైనా ఇవ్వాలంటే అది జగన్‌కే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బుధ‌వారం మంగ‌ళ‌గిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ తీవ్ర సంక్షోభంలో పడింది. రాజధాని లేదు, ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల సమర్థ నాయకుడు కావాలని ప్రజలు భావించి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఐదేళ్లలో ప్రజలు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టేందుకు కృషి చేశాం. అయితే 2019లో అబద్ధాలు, అసత్యాలు, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై దమనకాండ సాగించారని తెలిపారు.

రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా దివాళా అంచుకు చేర్చారు ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, మార్కెట్లు, వివిధ ఆదాయ వనరులను తాకట్టు పెట్టి భారీ స్థాయిలో అప్పులు తెచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టింది. మద్యం ఆదాయాన్ని కూడా భవిష్యత్ తరాలకు భారం అయ్యేలా ఉపయోగించారు. అభివృద్ధి లేకుండా, ఆదాయ సృష్టి లేకుండా అప్పులపై ఆధారపడిన పాలన సాగింది.
వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు మళ్లీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్నే కోరుకున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ మరోసారి అబద్ధాలు, ఆరోపణలు, విద్వేష రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ఈ రోజు “వెన్నుపోటు” పేరుతో ర్యాలీలు నిర్వహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ముందుగా తన రాజకీయ చరిత్రను చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కుటుంబం అండతో ఆయన కుటుంబానికి రాజకీయ గుర్తింపు వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి ల‌క్ష కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించి, జైలుకు వెళ్లిన‌ వ్యక్తి జగన్. తండ్రి మరణించిన సమయంలోనే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ జరిపించడం రాజకీయ చరిత్రలో ఎప్పటికీ మచ్చగా మిగిలిపోతుంది. పదవి రాలేదని కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టడం వెన్నుపోటు కాదా? జైలులో ఉన్న సమయంలో తల్లి, చెల్లెలు పార్టీ కోసం కష్టపడితే, అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే దూరం పెట్టడం వెన్నుపోటు కాదా? ఈ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలి. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని జ‌గ‌న్ ఈ రోజు యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదం. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. సంపూర్ణ మద్యనిషేధం తీసుకొస్తామని చెప్పి మాట తప్పారు. ఉద్యోగాలు, సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం ప్రతి అంశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని వ్యక్తికి మ్యానిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజలను మోసం చేసినందుకు జగన్ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవి. ఏదైనా అక్రమం జరిగి ఉంటే ఆధారాలతో ముందుకు రావాలని మంత్రి నారా లోకేష్ బహిరంగంగా సవాలు విసిరారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలి. అధికారిక వివరాలు బయటకు వచ్చిన తర్వాత వైసీపీ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టమైంది. సంవత్సరం క్రితం జరిగిన ప్రక్రియపై ఇప్పుడు అకస్మాత్తుగా ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర మాత్రమే ఉంది. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 2019లో అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేసిన విధానాన్నే మళ్లీ అమలు చేయాలని చూస్తున్నారు. అయితే ఈసారి ప్రజలు ఆ మోసాలకు అవకాశం ఇవ్వరు. వైసీపీ రాజకీయాల మూల సిద్ధాంతం ప్రజలను విభజించడం. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి కులరంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంపై బాధ్యతాయుతంగా స్పందిస్తోంది. ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణలు జరిపి నిజానిజాలు బయటపెడుతోంది. రాష్ట్రంలో శాంతి, భద్రత, సామాజిక సామరస్య పరిరక్షణకు కట్టుబడి ఉంది.

మత్స్య, ఆక్వా రంగాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ చార్జీల తగ్గింపు, రైతులకు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పన, అదనపు ఆర్థిక సహాయం వంటి చర్యలతో ఆక్వా రంగాన్ని లాభదాయకంగా మార్చింది. ప్రపంచ పరిస్థితులు, యుద్ధాల ప్రభావంతో కొన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం రైతుల పక్షానే నిలుస్తోంది. ఫీడ్ ధరలు, ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ పరిస్థితులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. రైతులకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోదు. హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నాయకులు చేసిన వ్యక్తిగత, అవమానకర వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య సంస్కృతి కాదు. ఈ వ్యాఖ్యలపై సంబంధిత నాయకులు, జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళలకు మరియు హోం మంత్రికి క్షమాపణ చెప్పాలి.

రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు అప్పుల ఊబిలోకి నెట్టి, అభివృద్ధిని అడ్డగించి, ప్రజలను విభజించే రాజకీయాలు చేసిన వైసీపీ ఇప్పుడు మళ్లీ అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గత అనుభవాలను మరిచిపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత ప్రతి రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉంది. ప్రజలు కూడా ఈ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములు కావాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!