Wednesday, June 17, 2026

రైతు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం : అచ్చెన్నాయుడు

Must read

రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, రైతు కుటుంబాల ఆర్థిక భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యల విషయంలో వైసీపీ సానుకూల ప‌త్రిక‌లో ప‌నిగ‌ట్టుకుని అబ‌ద్ధాల‌ను ప్ర‌చురిస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న ప్రచారం నిజం కాదని తెలిపారు. త్రిసభ్య కమిటీ విచారణ అనంతరం గత రెండేళ్ల కాలంలో 148 కేసులు మాత్రమే రైతు ఆత్మహత్యలుగా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. వ్యవసాయ కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పడిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తోందని తెలిపారు. ఇప్పటికే 148 కేసుల్లో 112 మంది రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసేందుకు బిల్లులు సమర్పించామని, మిగిలిన కేసులను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంలో మ‌ర‌ణించిన 81 మంది రైతుల‌కు ప‌రిహారం న‌గ‌దు ఇవ్వ‌లేద‌ని కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చినాక‌ 5.67 కోట్ల న‌గ‌దును సంబంధిత రైతుల కుటుంబాల‌కు చెల్లించామ‌ని మంత్రి తెలిపారు. రైతుల ఆర్థిక భద్రత కోసం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత‌ రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6,000 అందజేస్తోందని వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 46.86 లక్షల రైతు కుటుంబాలకు మూడు విడతలుగా మొత్తం రూ.8,985.41 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,425.23 కోట్లు అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం సేకరణ బకాయిలు పెండింగ్‌లో ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674.47 కోట్ల పాత బకాయిలను పూర్తిగా చెల్లించి రైతులకు అండగా నిలిచిందని మంత్రి వెల్లడించారు. రైతు శ్రమ దోపిడీకి గురికాకుండా, ఆయన శ్రమ సంపదగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ధరల స్థిరీకరణ నిధి ద్వారా విస్తృత సహాయం అందించామని తెలిపారు. గత బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించినప్పటికీ, రైతుల ప్రయోజనాల కోసం దాదాపు రెట్టింపు స్థాయిలో రూ.588 కోట్లు ఖర్చు చేసి లక్ష మంది రైతులను ఆదుకున్నామని వివరించారు. తోతాపూరి మామిడి రైతులకు రూ.190 కోట్లు, కడప, కర్నూలు ఉల్లి రైతులకు కొనుగోలు చర్యల కోసం రూ.17.56 కోట్లు, ఉల్లి పంట నష్టపరిహారం కింద హెక్టారుకు రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచి రూ.128.33 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అదేవిధంగా పొగాకు రైతులకు రూ.240 కోట్లు, కోకో రైతులకు రూ.12 కోట్లు చెల్లించి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.500 కోట్లు ప్రతిపాదించామని, అవసరమైతే రైతుల కోసం అదనపు నిధులు కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలోని 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంపై రూ.13,241.17 కోట్ల సబ్సిడీ వ్యయం జరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

రాష్ట్ర ఉద్యానవన రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి, రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును కేంద్ర సహకారం, ప్రైవేటు పెట్టుబడులతో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో 15.6 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉందని, ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా, కొబ్బరి ఉత్పాదకతలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. మిరప ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. పామాయిల్ తోటల విస్తరణకు 2026–27లో రూ.204 కోట్లు ప్రతిపాదించామని, పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్‌గా అభివృద్ధి చేసి ‘కోకో సిటీ’ ఏర్పాటు ద్వారా చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ కాలానికి సంబంధించిన రూ.1,990.10 కోట్ల ప్రీమియం సబ్సిడీ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పాపం జ‌గ‌న్ చేసిందే. మొద‌టి రెండేళ్లు ఇచ్చారు అందులో 1990 కోట్లు బ‌కాయి పెట్టారు, మిగ‌తా మూడు ఏళ్లు ప్రీమియం క‌ట్ట‌లేదు. బ‌కాయిని తిరిగి క‌ట్టేందుకు కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది.

సూక్ష్మసేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గిట్టుబాటు ధరలు, నష్టపరిహారం, విద్యుత్, సాగునీరు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా రైతులు వాస్తవాలను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి కింజరాపు తెలిపారు. జూన్ 8వ తేదీ నుండి జూన్ 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 95,506 మంది రైతులకు మొత్తం 4,77,501 ఎరువుల బస్తాలు విక్రయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 3,56,916 యూరియా బస్తాలు, 1,20,585 డీఏపీ బస్తాలు రైతులకు అందించామని తెలిపారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఎరువులను అక్ర‌మంగా అమ్ముకున్నారు, ఎరువులను రైతులకు అంద‌చేసేందుకు ప్ర‌త్యేక‌ యాప్ ను తీసుకొచ్చాం, రాష్ట్ర‌వ్యాప్తంగా స‌క్ర‌మంగా ఎరువుల‌ కొనుగోలు జ‌రుగున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!