Friday, June 26, 2026

విజయవాడలో సోలార్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని

Must read

విజయవాడలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ ఇస్లాంపేట బిఆర్పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన “ఆక్సిజనీ ఇన్ఫ్రా సోలార్ సర్వీసెస్” కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, సౌర శక్తి వినియోగం ద్వారా విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ ఖర్చులను నియంత్రించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ యోజన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని సూచించారు. వినియోగదారులు గరిష్టంగా రూ.78,000 వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని తెలిపారు. అదనంగా ఎటువంటి ముందస్తు చెల్లింపు లేకుండా జాతీయ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తుండటం ఈ పథకానికి ప్రత్యేకత అని వివరించారు.

స్థానికంగా “ఆక్సిజనీ ఇన్ఫ్రా సోలార్ సర్వీసెస్” ద్వారా ఈ పథకం అమలు చేయబడుతూ, వినియోగదారులకు సులభంగా సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు.

సౌర విప్లవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పర్యావరణాన్ని కాపాడే దిశగా సోలార్ శక్తి వినియోగం పెంచాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ పథకం అమలుతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా లభిస్తున్నాయని చెప్పారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే సంస్థల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆక్సిజనీ ఇన్ఫ్రా సోలార్ సర్వీసెస్ సంస్థ డైరెక్టర్ ఘంటా శరత్ బాబు, మేనేజింగ్ పార్ట్నర్ షేక్ అబ్దుల్లా, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా, జిల్లా అధ్యక్షులు ఎస్.కె కరీముల్లా, పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు మొహమ్మద్ అన్సర్, తెలుగు మహిళ అధ్యక్షురాలు షేక్ నసీమా, మార్కెట్ యార్డ్ కమిటీ ఉపాధ్యక్షులు పాల మాధవ, ఐటీడీపీ అధ్యక్షులు చైతన్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!