రేవంత్ ఎత్తుకు జగ్గా రెడ్డి పై ఎత్తు!
చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఎలా అయితే సమానంగా ఉండవో అలాగే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒకే మాట మీద ఉండరు. తెలంగాణాలో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉంది . రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత సీనియర్ నాయకులు అసహనంగా ఉన్నారు.
గత పదిహేను రోజులకు పైగా రేవంత్ రెడ్డి కి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి కి మాటల యుద్దం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంతలా మారింది. జగ్గారెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. అందులో రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను గౌరవించట్లేదు, ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీలో అందరిని కలుపుకొని పోయే వారికి టీపీసీసీ పీఠం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ లేఖ పెద్ద దుమారం లేపింది.
జగ్గారెడ్డి టీపీసీసీ తో సంబంధం లేకుండా సీఎం పై ప్రత్యేక పంథాలో యుద్ధాన్ని ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంభందించిన 307జీవో సమస్యతో సహా పలు అంశాలను చర్చించేందుకు ఈ నెల 17న సీఎం అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ ఇవ్వక పోతే అదే రోజున జగ్గారెడ్డి ప్రగతి భవన్ వద్దనే దీక్ష చేయాలనే నిర్ణయించారు.
జగ్గారెడ్డి ఎత్తుగడ ను ముందే పసిగట్టేసిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎత్తును చిత్తు చేశారు. జగ్గారెడ్డి దీక్షకు బదులు ఉమ్మడి పోరాటం చేయాలని టీ పీ.సి.సి నిర్ణయం తీసుకుంది. జగ్గారెడ్డి దీక్షను వాయిదా వేయాలని ఆ స్థానంలో సీఎల్పిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ సీఎం కు లేఖ రాశారు. ఉమ్మడి పోరాటంకి జగ్గారెడ్డి ఒప్పుకోవాల్సి ఉంది.
Share this article in your network!