ఇటీవల ఎన్నికలు కాంగ్రెస్ ను పూర్తిగా నిరాశ పరచడంతో పార్టీ ప్రక్షాళన, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో పార్టీ నేతలతో సోనియా గాంధీ కీలక సమావేశం నిర్వహించారు. అలాగే , ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరికపై చర్చించారు. 

పార్టీ ప్రక్షాళన , 2024ఎన్నికల్లో కాంగ్రెస్ గేం ప్లాన్ పై సుదీర్ఘంగా చర్చించారు.పార్టీలో పీకే చేరిక గురించి సీరియస్ డిస్కషన్ కూడా జరిగింది. వచ్చే సర్వాత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందేందుకు పీకే ఓ ప్రతిపాదనను రూపొందించారు. టార్గెట్ 370 అంటూ రూపొందించిన ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ 370 స్థానాల్లో పోటీ చేయగలదని, కొన్ని రాష్ట్రాలలో స్నేహపూర్వక పార్టీలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  

ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడాలని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ , మహారాష్ట్రలో పొత్తులు ఏర్పరచుకోవాలని కిషోర్ సూచించారు, దీనికి రాహుల్ గాంధీ అంగీకరించారు. కాని , పార్టీ ప్రక్షలనకు సంబంధించి ఒక్కసారిగా పూర్తి స్ట్రక్చర్ మార్చేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక , పీకే చేరికపై పార్టీలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. పీకేకు తెలంగాణలో KCR తో, ఏపీలో జగన్మోహన్ రెడ్డి తో సంబంధాలపై పార్టీలో కొందరి విమర్శలు వినిపించారు. ఈసారి, పార్టీ పునరుద్ధరణ కోసం ఒక గొప్ప ప్రణాళికతో పీకేను… రాహుల్ గాంధీపార్టీలో చేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది.