అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యోగ సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచానికి జ్ఞానం, సంస్కృతి, మానవ సంబంధాల విలువలను అందించిన గొప్ప దేశం భారతదేశమని అన్నారు. ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందిన భారతదేశాన్ని తిరిగి అదే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని తెలిపారు.
భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఈటల అన్నారు. ఐక్యరాజ్యసమితిలో యోగా దినోత్సవానికి ప్రతిపాదన చేసి, యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారని తెలిపారు. నేడు ప్రపంచంలోని అనేక దేశాలు యోగాను అనుసరిస్తుండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, యువతతో పాటు అన్ని వయసుల వారు యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో వరుసగా ఏడోసారి భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.




