రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2026 నెలలో అంగన్వాడి కేంద్రాలను హాఫ్‌డే పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం ద్వారా చిన్నారుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అంగన్వాడి కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండే ఈ కాలంలో చిన్నపిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇక మే నెలలో అంగన్వాడి కేంద్రాలకు పూర్తి స్థాయి వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి మే 31 వరకు పిల్లలకు సెలవులు ఇవ్వడంతో పాటు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు కూడా విశ్రాంతి కల్పించనున్నారు. అయితే, ఈ సెలవుల సమయంలో కూడా అంగన్వాడి సిబ్బంది తమ బాధ్యతలను కొనసాగించాల్సి ఉంటుంది.ప్రధానంగా పిల్లలకు టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీ చేయడం తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుంది. పోషకాహార లోపం రాకుండా పిల్లలకు అవసరమైన ఆహారాన్ని అందించడం ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా ఉంటుంది. అదేవిధంగా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఇంటింటా సర్వేలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.ప్రీ-స్కూల్ విద్యలో చేరికలు పెంచే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే చదువు మానేసిన పిల్లలను మళ్లీ అంగన్వాడి కేంద్రాల్లో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో గ్రామ స్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
వేసవి సెలవుల సమయంలో అంగన్వాడి సిబ్బంది నిర్వహించిన అన్ని కార్యకలాపాలపై సమగ్ర నివేదిక తయారు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలను నిర్ణయించనున్నారు.అదేవిధంగా ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు నిర్వహించే చైల్డ్ సేఫ్టీ వీక్, మే 25 నుంచి మే 30 వరకు జరిగే వుమెన్ థీమ్ వీక్ కార్యక్రమాల్లో అంగన్వాడి సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల భద్రత, మహిళల సంక్షేమంపై అవగాహన పెంపొందించనున్నారు.
ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేసవిలో పిల్లల ఆరోగ్యం రక్షణతో పాటు అంగన్వాడి సేవలు సమర్థవంతంగా కొనసాగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.



