Friday, June 26, 2026

మహాలక్ష్మి పథకం విజయోత్సవం: మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా

Must read

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం భారీ విజయాన్ని సాధించిందని మంత్రులు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సుమారు 290 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదవడంతో మహిళలు దాదాపు రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు మహిళా ఐఏఎస్ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా మంత్రులు మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ పథకం రాష్ట్రంలో మహిళా సాధికారతకు నిదర్శనమని పేర్కొన్నారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆలోచనలకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.మహిళలకు ఆర్థిక భారం లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ పథకం కోసం ఆర్థిక శాఖ ద్వారా భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విమర్శించే వారిపై మంత్రి తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే వారిని ప్రతి మహిళ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలదేనని స్పష్టం చేశారు.ఉచిత బస్సు ప్రయాణం వల్ల చిన్న ఉద్యోగాలు, ఉపాధి పనులు చేసే మహిళలకు ఎంతో మేలు జరిగిందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఆదా చేసుకోవడమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

అదేవిధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం ద్వారా వేల కోట్ల పెట్టుబడులతో లక్షల సంఖ్యలో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడ్డాయని తెలిపారు. మహిళా సంఘాల రుణాలపై రూ.1390 కోట్ల వడ్డీని ప్రభుత్వం భరించిందని వెల్లడించారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మహిళ సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని అన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!