Friday, June 26, 2026

జాతీయ అవార్డులతో మెరిసిన పంచాయతీరాజ్ శాఖ: సీఎం చంద్రబాబు అభినందనలు

Must read

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖ అధికారులకు, ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది అని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని చంద్రబాబు పేర్కొన్నారు. పల్లెల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, అందుకే సుపరిపాలన, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాలు వంటి కీలక అంశాల్లో జాతీయ అవార్డులు సాధించగలిగామని అన్నారు. ఈ పురస్కారాలు ప్రభుత్వ సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

శాఖను అత్యుత్తమ విధానాలతో ముందుకు నడిపిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు అధికారులందరికీ సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గ్రామ స్వరాజ్య సాధనలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ అవార్డులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఏడాది తమ శాఖ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా మహిళలకు అనుకూల వాతావరణం కల్పించిన పంచాయతీగా తిరుపతి జిల్లా బొక్కసం పాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని తెలిపారు.

అలాగే సుపరిపాలన విభాగంలో విశాఖ జిల్లా శృంగవరం, పేదరిక నిర్మూలనలో వైఎస్ఆర్ జిల్లా చెమ్ముళ్లపల్లి, మౌలిక వసతుల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని వివరించారు. ఈ విజయాలు గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు.ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మండలం దేశవ్యాప్తంగా మూడో అత్యుత్తమ మండలంగా ఎంపిక కావడం విశేషమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గత ఏడాది కూడా తమ శాఖ నాలుగు అవార్డులు గెలుచుకుందని, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించామని గుర్తుచేశారు.ఈ పురస్కారాలు తమపై మరింత బాధ్యతను పెంచాయని, గ్రామీణాభివృద్ధి కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!