రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలతో పాటు పరిశ్రమాభివృద్ధికి అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.అన్న ఎన్టీఆర్ “కూడు, గూడు, గుడ్డ” అనే నినాదంతో చేనేత రంగానికి అండగా నిలిచిన స్ఫూర్తితో ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కొత్త టెక్స్టైల్స్ పాలసీలు, మెగా క్లస్టర్లు, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు ద్వారా చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1.04 లక్షల చేనేత కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం ద్వారా మగ్గంపై నేసే కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీని వల్ల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి వేల రూపాయల ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.చేనేత రంగానికి పునర్జీవం తీసుకురావడంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద 92,724 మంది నేతన్నలకు పింఛన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పెంచారు. త్రిఫ్ట్ పథకంలో ప్రభుత్వ వాటాను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు.
అదేవిధంగా క్యాష్ క్రెడిట్ కార్డుల ద్వారా సహకార సంఘాలకు రుణాలు అందించడంతో పాటు చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద పలు క్లస్టర్లను మంజూరు చేశారు. 15 శాతం రాయితీతో నూలు సబ్సిడీ అందిస్తున్నారు. ముద్ర పథకం కింద వేలాది చేనేత కార్మికులకు రుణ సౌకర్యం కల్పించారు.చేనేత వస్త్రాల విక్రయాలను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ వినియోగదారులకు 40-50 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తున్నారు. ఆప్కో సంస్థను డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్లి ఆన్‌లైన్ ద్వారా వస్త్రాల కొనుగోలు, డోర్ డెలివరీ వంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ చర్యలతో అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.అదనంగా చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేస్తూ, త్వరలోనే “నేతన్న భరోసా” పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు, పిఠాపురం, మంగళగిరిలో ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. “వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్” పథకంలో రాష్ట్రానికి వచ్చిన అవార్డుల్లో చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు రావడం ఈ రంగం పురోగతికి నిదర్శనంగా భావిస్తున్నారు.ఇక నేతన్నల జీవనోపాధి మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరులు చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ కళాకారులకు అండగా నిలుస్తున్నారు.



