Friday, August 28, 2026

ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలిపివేత

Must read

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) కింద వైద్య సేవలను నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.3000 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉండటం, అలాగే కొత్తగా అమలు చేయాలనుకుంటున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) పై అభ్యంతరాల నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. గత నాలుగు నెలల్లోనే ఈ బకాయిలు రూ.2500 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు పెరిగినట్లు ఆసుపత్రుల ప్రతినిధులు వెల్లడించారు.

బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇవ్వలేదని, దీనివల్ల ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ఈ పరిస్థితిని తట్టుకోలేక మూతపడే స్థితికి చేరుకున్నాయని పేర్కొన్నారు.ఇక ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త ఇన్సూరెన్స్ మోడల్‌పై కూడా ఆసుపత్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 2017లో నిర్ణయించిన పాత ప్యాకేజీ ధరలనే ఇప్పటికీ కొనసాగించడం వల్ల ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా వైద్య సేవలు అందించడం సాధ్యం కావడం లేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. పెరిగిన ఔషధ ధరలు, సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీ రేట్లను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పాత బకాయిల సమస్యను పరిష్కరించకుండా కొత్త విధానంలోకి వెళ్లడం సరైనది కాదని, ఒకవేళ అలా చేస్తే రూ.3000 కోట్ల బాధ్యత ఎవరికి చెందుతుందన్న అనుమానం తమలో నెలకొన్నదని ఆసుపత్రుల సంఘం పేర్కొంది.ఈ నేపథ్యంలో ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని, ప్యాకేజీ ధరలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే రోడ్డెక్కి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ పరిణామం వల్ల రాష్ట్రంలోని వేలాది పేద రోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకం కింద సేవలు నిలిచిపోతే అత్యవసర వైద్య సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొనవచ్చు.ఇప్పటికైనా ప్రభుత్వం, ఆసుపత్రుల యాజమాన్యాలు చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్య రంగంలో ఏర్పడిన ఈ సంక్షోభం త్వరగా సద్దుమణిగితేనే ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!