Saturday, June 6, 2026
Google search engine

ట్యాంక్ బండ్ వద్ద పూలే దంపతుల విగ్రహాలు

Must read

హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న లేక్ వ్యూ పార్క్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్న నేపథ్యంలో మంత్రులు పనుల పురోగతిని సమీక్షించారు.మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశీలనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయి కుమార్, జెరిపాటి జైపాల్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించి, ఏప్రిల్ 11న జరగనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. రెండు రోజుల ముందుగానే విగ్రహాల ఏర్పాటు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభ ప్రాంగణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ట్యాంక్ బండ్ పై మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిబా పూలే చేసిన పోరాటాలు, మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి నేటి తరానికి మార్గదర్శకమని మంత్రి తెలిపారు. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చినట్లు గుర్తుచేస్తూ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ జిల్లా అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఏప్రిల్ 11న ఉదయం గ్రామాల్లో జ్యోతిబా పూలే కార్యక్రమాలను నిర్వహించి, సాయంత్రం ప్రధాన సభను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఇప్పటికే ఇందిరా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, పి.వి. నరసింహరావు విగ్రహాలు ఉండగా, ఇప్పుడు పూలే దంపతుల విగ్రహాలు కూడా చేరడం విశిష్టతగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ ప్రాంతాన్ని “పూలే మార్గ్”గా పేరు పెట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!