Friday, March 6, 2026
spot_imgspot_img

ప్రధానితో భేటీకి సిద్ధమైన సీఎం రేవంత్‌ రెడ్డి

Must read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం రేవంత్‌ రెడ్డి ఈ సాయంత్రం హైదరాబాద్‌ చేరుకొని ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఇక బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు ప్రారంభించింది. శాసనసభలో దీనిపై తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. రాష్ట్రంలోని విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేసి, ఆ మార్పులను 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. ఈ నేపథ్యంలో మోదీతో సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

చట్టసవరణకు ఆర్డినెన్స్‌ దారి
పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్ 285 (ఎ) ప్రకారం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధన ఉంది. దీనిలోని ’50 శాతానికి మించకుండా’ అనే వాక్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా చట్టసవరణ చేయాలని భావిస్తోంది. హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో.. చట్టసవరణను వేగవంతం చేసింది. న్యాయశాఖ ఆమోదించిన తర్వాత ముసాయిదాను మంత్రి, సీఎం ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపినట్లు తెలుస్తోంది.

గవర్నర్ ఆమోదిస్తే ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. అనంతరం డెడికేటెడ్ కమిషన్‌ ఏర్పాటు చేసి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుకు సిఫార్సులు చేయనుంది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఖరారు చేసిన రిజర్వేషన్ల వివరాలను పంపనుంది ప్రభుత్వం. అయితే.. గవర్నర్ ఆమోదిస్తారా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

రాజకీయంగా రిజర్వేషన్లపై దుమారం
ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో రాజకీయంగా వేడి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. బీజేపీ మాత్రం బీసీ జాబితాలోని ముస్లింలను తొలగించినప్పుడే రిజర్వేషన్ బిల్లు క్లియర్ అవుతుందని వాదిస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ బీసీలను మోసం చేస్తే మరో భూకంపం రావడం ఖాయమని హెచ్చరిస్తోంది. మరోవైపు బీసీ సంఘాలు ఈ ఆర్డినెన్స్‌ను ఎవరూ అడ్డుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!