- తిరుపరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
- కోర్టు తీర్పుతో కొండపై వెలిగిన దివ్య జ్యోతి
- పోలీసుల భారీ బందోబస్తు నడుమ దీపారాధన
- దీపాన్ని చూసి భక్తిపారవశ్యంలో మునిగిపోయిన భక్తులు
Thiruparankundram Deepam : తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై ఎట్టకేలకు కార్తీక మహాదీపం వెలిగింది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదం, న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం (నవంబర్ 28) సాయంత్రం కొండపై ఉన్న పురాతన రాతిస్తంభంపై దీపాన్ని వెలిగించారు. దీంతో భక్తుల ఎదురుచూపులకు తెరపడింది. కొండపై జ్యోతి వెలగడంతో ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ‘హరోం హర’ నినాదాలతో గిరి పరిసరాలు మార్మోగాయి..
రాతిస్తంభంపై కార్తీక దీపం :
శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా దీపారాధన నిర్వహించారు. ఇప్పటికే మండపంపై వెలుగుతున్న దీపం నుంచి జ్యోతిని తీసుకొచ్చి రాతిస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో కార్యక్రమం జరిగింది. విశ్రాంత న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు..
భారీగా తరలివచ్చిన స్థానికులు, భక్తులు :
ఈ అద్భుత ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే, భద్రతా కారణాలతో కొండపైకి కేవలం 50 మందిని మాత్రమే అనుమతించారు. దర్గా చుట్టూ 50 మీటర్ల మేర బఫర్ జోన్ ఏర్పాటు చేశారు.
వాస్తవానికి తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే అంశంపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఉచ్చిపిళ్లైయార్ ఆలయం వద్ద ఉన్న దీప మండపంతో పాటు, దర్గా సమీపంలోని పురాతన రాతిస్తంభంపై కూడా దీపం వెలిగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం సాగింది.
సుప్రీం మధ్యంతర ఆదేశాలు :
నవంబర్ 20న సుప్రీంకోర్టు రాతిస్తంభంపై దీపం వెలిగించేందుకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆదేశాల అమలుపై మరో వివాదం తలెత్తడంతో సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. శనివారం దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. దీంతో ఎట్టకేలకు కొండపై కార్తీక జ్యోతి వెలిగింది. భక్తుల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేరిన ఈ ఘటన ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది..




