Motor Insurance Rules : వాహనదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. ఇకపై పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులు మోటార్ ఇన్సూరెన్స్ కోసం ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. అంతేకాదు.. కార్లు, బైకులకు దీర్ఘకాలిక బీమా పాలసీలను ఒకేసారి ప్రీమియం చెల్లించే విధానాన్ని కూడా తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండేలా చేయడం, రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు పరిశీలిస్తోంది.
ప్రస్తుతం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలను బీమా ప్రీమియంతో అనుసంధానించే ప్రతిపాదనపై పనిచేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో ఒక వాహనంపై నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని బీమా ప్రీమియాన్ని నిర్ణయించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారు, ఎక్కువ చలాన్లు ఉన్న వాహన యజమానులు అధిక బీమా ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. అయితే ఏయే ఉల్లంఘనలకు ఎంత అదనపు ప్రీమియం విధిస్తారు? ఎన్ని చలాన్లు ఉంటే ప్రీమియం పెరుగుతుంది? అనే వివరాలు ఇంకా ఖరారు కాలేదు.
మరో విషయం ఏమిటంటే.. కార్లకు నాలుగేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఆరేళ్ల కాలపరిమితితో ఒకేసారి ప్రీమియం చెల్లించి బీమా పొందే విధానాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుతం వాహనదారులు నిర్దిష్ట కాలానికి బీమా పాలసీలు తీసుకుంటున్నారు. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే పదేపదే పాలసీలను రెన్యువల్ చేసుకునే అవసరం తగ్గుతుంది. దీని ద్వారా ఎక్కువ వాహనాలకు నిరంతర బీమా కవరేజీ కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు ‘నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్’ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. తొలుత హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు చొప్పున మొత్తం 10 పెట్రోల్ బంకుల్లో ఈ విధానాన్ని పరీక్షించనున్నారు.
ఈ పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వాహన నంబర్ ఆధారంగా దానికి చెల్లుబాటు అయ్యే బీమా ఉందా లేదా అనేది గుర్తించే సాంకేతికతను ఉపయోగిస్తారు. బీమా లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేయకుండా నిరోధించే విధానంపై ఈ ప్రయోగం ద్వారా సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.




