Rohit Sharma : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరోసారి నియమితులయ్యాడు. 2027 ఐపీఎల్ సీజన్లో అతడి సారథ్యంలోనే ముంబై బరిలోకి దిగనుంది. ఐదు సార్లు ముంబైకి ట్రోఫీలను అందించిన ఈ దిగ్గజ ఆటగాడు మరోసారి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న తరువాత కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడానికి సిద్ధంగా లేనని, ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో, జట్టు సహ యజమాని అనంత్ అంబానీతో చర్చించిన తరువాతనే ఓకే చెప్పినట్లుగా రోహిత్ తెలిపాడు.
మరోసారి కెప్టెన్సీ బాధ్యతలను నాకు అప్పగించాలని ముంబై మేనేజ్మెంట్ భావించింది. నిజం చెప్పాలంటే తొలుత నేను అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే సారథ్య బాధ్యతలను నిర్వర్తించడానికి నేను సిద్ధంగా లేను. గత సీజన్లలో ఎదురైన నిరాశతో కొంత సమయం కావాలని అడిగాను. ఆకాశ్ అంబానీతో చర్చించిన తరువాత ఒకే చెప్పాను అని రోహిత్ అన్నాడు.
గత కొన్నాళ్లుగా ముంబై ఇండియన్స్ టీమ్ ఆట పరంగా గానీ, క్రికెట్ నైపుణ్యాల పరంగా గానీ, వెనుకబడి ఉన్నదని అనిపించిందన్నాడు. అయితే.. ఇది తాను నిర్మించిన జట్టు అని, ఇందులో తాను ఓ బాగం అని, అలాంటి తన టీమ్‌ను ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకుండా ఉన్నానని చెప్పాడు. అందుకనే మరోసారి బాధ్యతలను చేపట్టినట్లు వివరించాడు. అయితే.. తాను బాధ్యతలను చేపట్టగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవన్నాడు.
ఐపీఎల్లో భిన్నమైన నేపథ్యం కలిగిన ప్లేయర్లు ఆడతారన్నాడు. వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం సవాల్‌తో కూడుకున్నదని చెప్పుకొచ్చాడు. తాను 25 ఏళ్ల వయసులోనే కెప్టెన్ అయ్యానని, తనకు ఇప్పుడు 39 ఏళ్లు వచ్చాయన్నాడు. 14 ఏళ్ల పాటు నాయకత్వం వహించానని అన్నాడు.
ట్రోఫీల గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదన్నాడు. తొలుత ఆటను ఆస్వాదించాలని మాత్రమే ఆటగాళ్లకు చెబుతానన్నాడు. క్రికెట్లో ఒత్తిడి సహజం అని, అలాంటప్పుడు దాని గురించి ఆలోచించడం అవపరం లేదన్నాడు. మొన్నటి వరకు తమ జట్టుపై అభిమానులకు ఉన్న విశ్వాసం కాస్త తగ్గిందన్నాడు. హోంగ్రౌండ్ వాంఖడేలోనూ తాము మ్యాచ్‌లు గెలవలేకపోయామన్నాడు. అయితే.. ఇకపై మ్యాచ్‌లు గెలిచి అభిమానుల మద్దతు, నమ్మకాన్ని తిరిగి సంపాదించుకుంటామని చెప్పాడు.
వ్యక్తిగతంగా, జట్టు పరంగా సరైన ఆటతీరు ప్రదర్శించకపోతే ఓటములు తప్పవన్నాడు. వచ్చే సీజన్ నాటికి జట్టును సమాయత్తం చేసి అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ శర్మ తెలిపాడు.




