Kadapa Parishad Results: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా సాగిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల ఫలితాలలో ప్రతిష్టాత్మక ఉమ్మడి కడప జిల్లాలో కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీకు బలమైన కోటగా భావించే కడప జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ఊహించని రీతిలో భారీ మెజార్టీలు సాధించి సరికొత్త సంచలనం నమోదు చేశారు. కడప (Kadapa Parishad Results)పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంటూ కూటమి నాయకులు, కార్యకర్తలు రికార్డు విజయాన్ని నమోదు చేశారు.
జడ్పీటీసీ స్థానాల్లో క్లీన్ స్వీప్.. పులివెందులలో తెదేపా చారిత్రాత్మక గెలుపు:
ఉమ్మడి కడప జిల్లాలోని 39 జడ్పీటీసీ స్థానాలకు గాను 23 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన 16 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 13 స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం మీద టీడీపీ 30, భాజపా 3, జనసేన 3 స్థానాలు సాధించగా, వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, రాజంపేట టీడీపీ అభ్యర్థి పోలి సుబ్బారెడ్డి ఏకంగా 17,440 ఓట్ల భారీ మెజార్టీతో రికార్డు సృష్టించారు.
ఎంపీటీసీ పోరులోనూ స్పష్టమైన ఆధిక్యం.. వైసీపీ తీవ్ర నిరాశ:
జిల్లా పరిధిలోని 351 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే కూటమికి ఏకగ్రీవం కాగా, మిగిలిన 55 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ 30కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. వేంపల్లి, వేముల స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించగా, నందలూరు కౌంటింగ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ ఫలితాలతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూటమి శ్రేణులు బాణాసంచా కాల్చి, విజయోత్సవ సంబరాలు జరుపుకున్నాయి.


