తెలంగాణ సోయికి నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ: కేసీఆర్

Must read

చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ధిక్కార స్వరంగా నిలిచారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సోయికి ఆమె నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె త్యాగాలను స్మరించుకుంటూ కేసీఆర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.నాటి రాచరిక పాలనలో తెలంగాణ రైతాంగం న్యాయమైన హక్కుల కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కేసీఆర్ పేర్కొన్నారు. అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీకగా నిలిచారని అన్నారు. నాటి భూస్వామ్య వ్యవస్థను ధైర్యంగా ఎదుర్కొని తన హక్కుల కోసం పోరాడటమే కాకుండా, అప్పటి చట్టాల పరిధిలోని న్యాయస్థానాల్లోనూ పోరాడి విజయం సాధించడం ద్వారా ఆమె ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటారని పేర్కొన్నారు.ఐలమ్మ పోరాట పంథా నేటి తరానికి ఆదర్శనీయమని కేసీఆర్ అన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రస్తుత రాజకీయ, పాలనా పరిస్థితుల్లో ఐలమ్మ చూపించిన ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని, తెలంగాణ సోయిని యువత అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.శాంతియుత పంథాలో తాను చేపట్టిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కూడా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రేరణగా నిలిచిందని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని తెలిపారు.

ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాం

చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని, ఆమె పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించిందని కేసీఆర్ తెలిపారు.ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహిళలు, శిశు సంక్షేమం, రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతి కోసం పలు పథకాలు అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులకు ప్రోత్సాహం అందించి సబ్బండ వర్గాల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.ఆ నమూనా ద్వారా సాధించిన ఫలితాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించడం ద్వారానే చాకలి ఐలమ్మకు నిజమైన నివాళి అర్పించినవారమవుతామని స్పష్టం చేశారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!