వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. విజయనగరం నగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల చిన్న శ్రీను పార్టీ మారిన నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తదితరులు హాజరయ్యారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.చిన్న శ్రీను పార్టీ మారిన అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీకి అండగా నిలవాలని, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు కార్యకర్తలే బలంగా నిలవాలని సూచించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా కార్యకర్తలు బొత్స 2.0 కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఏర్పాటు సమయంలో కేవలం నాయకులను మాత్రమే నమ్మలేదని, వైఎస్సార్ అభిమానులు, ప్రజలను నమ్ముకుని పార్టీ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు.చంద్రబాబుపై అమర్‌నాథ్ విమర్శలు చేశారు. కుటుంబాలను విడదీసే చరిత్ర చంద్రబాబుకు ఉందని ఆరోపించారు. అయితే బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని మాత్రం ఎవరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు చేసిన వారు.. ఇప్పుడు లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చని అన్నారు.
ఇదే సమయంలో బొత్స సత్యనారాయణను అమర్‌నాథ్ ‘రాజకీయ విశ్వవిద్యాలయం’గా అభివర్ణించారు. ఎంతోమంది నాయకులను సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకువచ్చిన రాజకీయ అనుభవం బొత్సకు ఉందని కొనియాడారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.చిన్న శ్రీను పార్టీ మారిన అంశంపై అమర్‌నాథ్ మాట్లాడుతున్న సమయంలోనే బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడంతో సమావేశంలో కొంతసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పార్టీకి, తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాల ప్రస్తావన నేపథ్యంలో బొత్స భావోద్వేగానికి గురైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదే సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన బావమరిది చిన్న శ్రీను పార్టీ మారడం, దాని ప్రభావం తనపై పడుతుందన్న ఆవేదనను ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న అప్పలనాయుడు.. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదగడంలో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అందించిన సహకారం కీలకమని పేర్కొన్నారు.వారికి అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని అప్పలనాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటే ఎలాంటి రాజకీయ పరిస్థితినైనా ఎదుర్కొనవచ్చని నేతలు పేర్కొన్నారు.


