Tuesday, August 18, 2026

‘మోటార్లు నడపలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. హరీశ్ రావు సంచలన ప్రకటన

Must read

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేవలం మూడు నెలల పాటు మంత్రి పదవి ఇస్తే, కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను తిరిగి ప్రారంభిస్తానని, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించి చూపిస్తాన్నారు. ఒకవేళ ఆ పని చేయకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు, తుమ్మిడిహట్టి బ్యారేజీ, నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

“మూడు నెలలు నీటిపారుదల శాఖను నాకు అప్పగించండి. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి ఎల్లంపల్లికి నీటిని పంపిస్తాను. అది చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతాను” అని సవాల్ విసిరారు. అదేవిధంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో రూ.2,328 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపిస్తూ, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలు రాజకీయ ఉద్దేశాలతోనే ఉన్నాయని ఆయన ఆరోపించారు. “నేను చెబుతున్న ప్రతి అంశానికి ఆధారాలు ఉన్నాయి. నా ఆరోపణలు, నేను చూపిస్తున్న పత్రాలు తప్పని ప్రభుత్వం నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవితో పాటు రాజకీయాలకు కూడా రాజీనామా చేస్తాను” అని హరీశ్ రావు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవాల ఆధారంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా మారిందని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి అవసరాలను కూడా తీర్చిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును రాజకీయ వివాదాల కోసం ఉపయోగించడం రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణపై ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తుండగా, బీఆర్ఎస్ నేతలు వాటిని ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!