తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో పగటి సమయంలో ఎండ తీవ్రత కనిపించినా రాత్రి వేళల్లో వాతావరణం మారి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..




