హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తో కలిసి చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, ప్రీ-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసి, ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాలను అందజేశారు.
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అభ్యాసన పుస్తకాలు, ఆటవస్తువులను అందించారు. కేంద్రంలో అందుతున్న ప్రీ-స్కూల్ విద్య, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించి చిన్నారుల అభ్యాస పురోగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, బాల్యంలోనే విద్యకు బలమైన పునాది వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను సమగ్రంగా అందిస్తూ చిన్నారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి అంగన్‌వాడీలో చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అంగన్‌వాడీ సేవలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా అంగన్‌వాడీలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అంగన్‌వాడీల ద్వారా లభించే సేవలపై తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని తమ పిల్లలను కేంద్రాల్లో నమోదు చేయించాలని సూచించారు.
రాష్ట్రంలో అంగన్‌వాడీలను కేవలం పోషకాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో అంగన్‌వాడీల్లో యూనిఫాంలు ఇచ్చే పరిస్థితి లేదని, కానీ తమ ప్రభుత్వం ప్రతి చిన్నారికి రెండు జతల యూనిఫాంలను అందించడంతో పాటు “అమ్మ మాట – అంగన్‌వాడి బాట” కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతోందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి మంచి స్పందన రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులకు పోషకాహారం అందించేందుకు 57 రకాల విద్యా, ఆట వస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. నర్సరీ విద్య పూర్తి చేసిన చిన్నారులకు ప్రత్యేక సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో 9 లక్షల మంది చిన్నారులు నమోదు అయ్యారని, వారి ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఖిచిడీ, ఎగ్ బిర్యానీ వంటి పోషకాహారాన్ని అందిస్తున్నామని, అంగన్‌వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. కేంద్రాల్లో ఆకర్షణీయమైన పెయింటింగ్స్ వేయించడం ద్వారా చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందిస్తున్నామని, వారి మెదడు వికాసం, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
“అంగన్‌వాడీల ద్వారా పిల్లల నాలెడ్జ్‌ను పెంచి, నాణ్యమైన విద్యకు బలమైన పునాది వేస్తున్నాం. రాష్ట్రంలో 38 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. సిబ్బంది కోరిక మేరకు నెలన్నర సెలవులు కూడా మంజూరు చేశాం. పోషకాహారంతో పాటు విద్యను అందించే సమగ్ర వ్యవస్థగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దుతున్నాం” అని సీతక్క పేర్కొన్నారు.
తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, “లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం లేదు. మీ పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించండి. అత్యుత్తమ వాతావరణంలో వారిని తీర్చిదిద్దుతాం. మా అంగన్‌వాడీ టీచర్లకు మంచి నైపుణ్యం ఉంది. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల సామర్థ్యం అంగన్‌వాడీ వ్యవస్థకు ఉంది” అని అన్నారు.
కార్యక్రమం అనంతరం మంత్రి సీతక్క అవగాహన ర్యాలీని ప్రారంభించి కమ్యూనిటీకి సందేశం ఇచ్చారు. “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట”, “ప్రైవేట్ నర్సరీ వద్దు.. అంగన్‌వాడీ ముద్దు” అంటూ నినాదాలు చేయిస్తూ అంగన్‌వాడీ విద్యా వ్యవస్థ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించారు. చిన్నారుల సమగ్రాభివృద్ధి, నాణ్యమైన బాల్య విద్య, మెరుగైన పోషణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి చిన్నారి ఉత్తమ అవకాశాలు పొందేలా చర్యలు కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, జాయింట్ డైరెక్టర్ మోతి, శాఖ అధికారులు, గోల్కొండ ప్రాజెక్టు సీడీపీఓ రేణుక, సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజలను మంత్రి సీతక్క అభినందించారు.



