Wednesday, August 26, 2026

నెల్లూరులో మత్స్యకారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

Must read

నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బోగోలు మండలం, జువ్వలదిన్నె గ్రామ పరిధిలోని అలిచెర్ల బంగారుపాళెం హ్యాంలెట్‌కు చెందిన మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లిన సందర్భంగా ఈ విషాద ఘటన చోటుచేసుకుందని అధికారులు మంత్రికి వివరించారు. భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పడవలు ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. సముద్రంలోకి వెళ్లిన ఐదుగురు మత్స్యకారుల్లో ఒకరు సురక్షితంగా తిరిగి రాగా, ఇద్దరు మత్స్యకారులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారని, వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గల్లంతైన మత్స్యకారులను క్షేమంగా గుర్తించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. బాధిత మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన వారిలో తూపిలి బాలమురళి, కుమారి గోవిందు, క‌నిపించ‌కుండా ఉన్న‌వారిలో తులసింగారి గణేష్, తులసింగారి రాజా ఉన్నార‌ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!