హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్‌తో పాటు స్త్రీనిధి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్త్రీనిధి ఉద్యోగులు “స్త్రీనిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్”ను ఏర్పాటు చేసుకోగా, మంత్రి సీతక్క వారిని అభినందించారు. ఉద్యోగుల హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేసే వేదికగా ఈ సంఘం పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “స్త్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిది. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల భవిష్యత్తు, మహిళల ఆర్థిక సంక్షేమం సురక్షితంగా ఉంటుంది” అన్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీనిధి సంస్థ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత బలోపేతం అవుతోందని తెలిపారు.మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీనిధిని ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. ఇప్పటివరకు 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్లకు పైగా రుణాలు అందించడం సంస్థ గొప్ప విజయమని కొనియాడారు. “స్త్రీనిధి అసలైన మహిళా బ్యాంక్” అని అభివర్ణించిన మంత్రి, తెలంగాణ మహిళలకు ఇది నమ్మకమైన ఆర్థిక వేదికగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్త్రీనిధి నమూనాను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమేనని, ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. మహిళల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అన్న నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18 శాతానికే పరిమితమైందని, అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40 శాతానికి చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు కూడా ఆ స్థాయికి ఎదగాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
స్త్రీనిధి సంస్థపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఉద్యోగులంతా కలిసి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో 16 మంది ఉద్యోగులను తొలగించారని, కానీ తమ ప్రభుత్వం ఉద్యోగ అనుకూల ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఇప్పటికే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని వెల్లడించారు.
స్త్రీనిధి సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎండీ విద్యాసాగర్ రెడ్డిని మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆయనను మంత్రి, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కొత్త నాయకత్వంలో స్త్రీనిధి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.



