Friday, June 26, 2026

సంస్కరణలే సంపద సృష్టికి పునాది :ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

Must read

సంపద సృష్టికి సంస్కరణలే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పారు.

ముంబైలో ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని కోరుకుంటున్నాను.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రావాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఏపీలో అనుమతుల వేగాన్ని పారిశ్రామిక వేత్తలు గుర్తించాలి. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. దేశంలో సంస్కరణలు అమలు అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది.

ఇది పెట్టుబడులకు కూడా మెరుగైన సమయం. భారత్‌కు అత్యుత్తమ పెర్ఫార్మర్, రిఫార్మర్, విన్నర్ గా ప్రధాని మోదీ ఉన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనే విధానాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. ఏఐ డాక్టర్, ఎఐ ట్యూటర్, ఏఐ అగ్రానమి లాంటి సేవలు అందిస్తున్నాం. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుంది. దేశంలో ఆర్ధిక సంస్కరణల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండడం నా అదృష్టం.

సంస్కరణలకు అనుగుణంగానే నాడు ఉమ్మడి ఏపీలో విజన్ 2020ను అమలు చేశాం. ఆ ఫలాలనే ఇప్పుడు హైదరాబాద్ చూస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్ భారత్ రూపకల్పన చేశారు. అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్ష. 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని మేం అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు క్వాంటం, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంది.”అని సీఎం చెప్పారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!