Saturday, June 6, 2026
Google search engine

వేసవి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

Must read

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర అవసరాలు లేకపోతే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటికి రావడం పూర్తిగా నివారించాలని మంత్రి సూచించారు. ముఖ్యమైన పనులు ఉంటే ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలోనే పూర్తి చేసుకోవాలని, మిగిలిన సమయాల్లో ఇంట్లోనే ఉండడం ఆరోగ్యానికి మంచిదని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు టోపీ, తలపాగా లేదా గుడ్డతో కప్పుకోవడం, శరీరాన్ని ఎండ నుంచి రక్షించుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ చలివేంద్రాల ద్వారా ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇక ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక సూచనలు చేశారు. వేసవికాలంలో ఎక్కువగా పనులు జరుగుతున్న నేపథ్యంలో కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండలో పని చేయాల్సి వస్తే తలకు తలపాగా ధరించడం, తరచూ నీరు తాగడం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం తప్పనిసరి అని తెలిపారు. పనిస్థలాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని ఇప్పటికే అధికారులకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు.

అదేవిధంగా, ఉపాధి హామీ పనుల్లో హాజరు నమోదు కోసం అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. కార్మికులు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో పనులను నివారించాలని సూచించారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!