Friday, June 26, 2026

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

Must read

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన ఖండించారు.

మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, పునర్విభజన వల్ల కేంద్రంలో లభిస్తున్న పదవులు కూడా దక్కవని, దక్షిణాది నాయకులు బంట్రోతులుగా మారతారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలను గతంలో బంట్రోతులుగా చూసింది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి అంజయ్యతో పాటు పలువురు నాయకులను ఎలా అవమానించారో దేశం చూసిందని ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తీరే వివాదాస్పదమైందని ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి కనీసం 50 శాతం సీట్లు పెంచే ప్రతిపాదనపై కూడా కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని అన్నారు.

దక్షిణాదికి బీజేపీ కీలక పదవులు ఇవ్వలేదన్న విమర్శలను తిప్పికొడుతూ, ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వెంకయ్యనాయుడు, సీపీ రాధాకృష్ణన్ వంటి నేతలు దక్షిణాదివాళ్లు కాదా అని ప్రశ్నించారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ భావజాలాన్ని రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు.

ఇక రాహుల్ గాంధీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌ను వదిలి కేరళకు వెళ్లిన ఆయనపై కాంగ్రెస్ స్పందన ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాది ముఖ్యమంత్రులకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్లే నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని కూడా కిషన్ రెడ్డి విమర్శించారు. జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి రాష్ట్రానికి కనీసం 50 శాతం సీట్లు పెంపు ప్రతిపాదన తీసుకువచ్చారని వివరించారు.

అయితే గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!