Saturday, June 6, 2026
Google search engine

అక్షరానికి మించిన ఆయుధం లేదు..ఆడ‌బిడ్డ‌లంతా అక్షరమాల కార్యక్రమంలో చేరండి – మంత్రి సీతక్క

Must read

మహిళల సాధికారతకు అక్షరాస్యతే బలమైన పునాది అనే దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష ఫలితాలను అందిస్తోంది. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆదరణ పొందుతోంది.

చదువుకోలేక వెనుకబడిన మధ్యవయసు, వృద్ధ మహిళలకు మరోసారి విద్యా అవకాశాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కుటుంబ బాధ్యతల వల్ల చదువు మధ్యలో ఆగిపోయిన మహిళలు తిరిగి పుస్తకాలు పట్టడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది. గ్రామ స్థాయిలోనే స్వయం సహాయక బృందాల ఆధారంగా తరగతులు నిర్వహించడం వల్ల మహిళలు సౌకర్యవంతంగా పాల్గొనే వాతావరణం ఏర్పడింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,01,357 మంది మహిళలు ఈ కార్యక్రమంలో చదువు నేర్చుకోగా, ఇటీవల నిర్వహించిన అక్షరాస్యత పరీక్షకు 6,31,656 మంది హాజరయ్యారు. అంటే సుమారు 90 శాతం మంది మహిళలు పరీక్ష రాయడం ఈ కార్యక్రమంపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ లేదా మే నెలలో వెలువడే అవకాశం ఉంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు పదో తరగతి పరీక్షలకు హాజరు కావచ్చు.

ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛంద సేవా భావంతో అమలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో వాలంటీర్లు, కమ్యూనిటీ వనరుల వ్యక్తులు ముందుకు వచ్చి మహిళలకు అక్షరజ్ఞానం అందిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 40 నుంచి 60 మంది నిరక్షరాస్య మహిళలను గుర్తించి, వారికి స్థానికంగా 8 నుంచి 10 మంది వాలంటీర్లు శిక్షణ అందించారు. కుటుంబ సభ్యులే వాలంటీర్లుగా ఉండడం వల్ల సహజ వాతావరణంలో నేర్చుకునే అవకాశం కలిగింది.

ఈ కార్యక్రమంలో బోధనా విధానం మహిళలు సులభంగా నేర్చుకునేలా రూపొందించబడింది. 16 వారాల శిక్షణ కార్యక్రమం 2025 అక్టోబర్‌లో ప్రారంభమైంది. నోటుపుస్తకాలు, ప్రాథమిక అభ్యాస సాధనాలను ఉచితంగా అందించారు. పాఠ్య విధానం కేవలం పుస్తకాలకు పరిమితం కాకుండా దృశ్య, అనుభవాత్మక పద్ధతులను కలిపి రూపొందించారు. గుర్తులు, చిత్రాలు, పరిచిత అంశాలను ఉపయోగించి అక్షరాస్యతకు సంబంధించిన ప్రాథమిక విషయాలను సులభంగా అర్థమయ్యేలా బోధించారు.

దీంతో మహిళలు మొదట తమ పేర్లు, గ్రామం, జిల్లా పేర్లను గుర్తించడం నుంచి ప్రారంభించి, క్రమంగా చదవడం, వ్రాయడం వైపు ముందుకు సాగారు. ఈ క్రమబద్ధమైన విధానం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి అక్షరజ్ఞానంపై పట్టును పెంచింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వయోజన విద్యాశాఖతో సమన్వయం చేస్తూ అమలు చేశారు. వాలంటీర్లు, శిక్షకులకు వివిధ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయిలో కమ్యూనిటీ వాలంటీర్లు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సంస్థ ప్రతినిధులు కలిసి శిక్షణ పొందడం ద్వారా బోధనలో నాణ్యతను నిర్ధారించారు.

ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులైన మహిళలకు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించడం ద్వారా వారి విద్యా ప్రస్థానానికి కొత్త దిశను ప్రభుత్వం చూపిస్తోంది. దీని ద్వారా మహిళలు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా, స్వయం నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదుగుతున్నారు. అక్షరాస్యతతో మహిళలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించుకోవడం, బ్యాంకింగ్ లావాదేవీలు స్వయంగా నిర్వహించడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడం వంటి అంశాల్లో ముందుకు వస్తున్నారు. కుటుంబం, సమాజంలో వారి పాత్ర మరింత బలపడుతోంది.

జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యతలో ఇంకా లింగ వ్యత్యాసం కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణలో అమలవుతున్న ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తోంది. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న సంకల్పానికి అక్షరాస్యత బలమైన పునాదిగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, మహిళల సాధికారతకు అక్షరాస్యతే కీలకమని అన్నారు. ప్రతి మహిళ చదువుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. “అక్షరానికి మించిన ఆయుధం లేదు. చదువు ద్వారా మహిళలు తమ జీవితాలను స్వయంగా మార్చుకునే శక్తిని పొందుతారు” అని ఆమె పేర్కొన్నారు.

స్వయం సహాయక బృందాల మహిళలు చూపుతున్న చురుకుదనం అభినందనీయమని, వారి భాగస్వామ్యం సమాజంలో పెద్ద మార్పుకు నాంది అవుతుందని మంత్రి తెలిపారు. అక్షరాస్యత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మహిళలు పదో తరగతి, ఆపై చదువులు కొనసాగించేలా ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు అందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!