బాలకృష్ణ సినీ ఫంక్షన్ లను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: కన్నబాబు
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలులో తొలుత ఏబీఎమ్ కళాశాల మైదానంలో నిర్వహించాలనుకున్నప్పటికీ, అధికారులు అనుమతించకపోవడంతో బీఎంఆర్ అర్జున్స్ ఇన్ ఫ్రా సంస్థకు చెందిన స్థలంలో నిర్వహించారు.
అటు, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖ ఆర్కే బీచ్ లో జరగనుండగా, అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వేదికను ఏయూ ఇంజినీరింగ్ కాలేజికి మార్చారు. చివరికి మళ్లీ ఆర్కే బీచ్ లోనే వాల్తేరు వీరయ్య ఫంక్షన్ జరిపేందుకు అనుమతులు వచ్చినట్టు తెలుస్తోంది.
దీనిపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. తమకు బాలకృష్ణ తక్కువ కాదు, చిరంజీవి ఎక్కువ కాదు అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అందరినీ సమదృష్టితోనే చూస్తుందని అన్నారు.
బాలకృష్ణ సినిమా ఫంక్షన్ వేదిక తరలి వెళ్లడం వెనుక ప్రభుత్వ దురుద్దేశాలేవీ లేవని, బాలకృష్ణ సినిమా ఫంక్షన్ ను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని కన్నబాబు పేర్కొన్నారు. అదేసమయంలో, చిరంజీవి సినిమా వేడుకకు విశాఖ ఆర్కే బీచ్ లో నిబంధనల ప్రకారం అనుమతులు లభించి ఉంటాయని, అందుకే ఆ కార్యక్రమాన్ని అక్కడ జరుపుకుంటున్నారని వివరణ ఇచ్చారు.
Share this article in your network!