ఏపీ ఇంటర్, పదవ తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రులు. 

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా విద్యార్ధులు పరీక్షలకు దూరమయ్యారు. ప్రస్తుతం కరోనా థర్డ్‌‌వేవ్ ఉన్నా..నియంత్రణలో ఉన్నందున ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి సంక్రమణ పరిస్థితుల్ని పూర్తిగా అంచనా వేసి..అన్ని విధాలుగా ఆలోచించి పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. 2021-22 సంవత్సరపు ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు విడుదల చేశారు. విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రులు. మే 2 నుంచి మే 13వ తేదీ వరకూ ఏపీలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 లక్షల 39 వేల 805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకూ జరుగుతాయి. మార్చ్ 11 నుంచి 31 వరకూ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1456 సెంటర్లలో ఇంటర్ పరిక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షల్ని 5 లక్షల 5 వేల 52 మంది రాయనుండగా, రెండో సంవత్సరం పరీక్షల్ని 4 లక్షల 81 వేల 481 మంది విద్యార్థులు రాయనున్నారు. మొత్తం 9 లక్షల 86 వేల 533 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.