పెద్దయ్యగారి సంస్మరణ సభ విశేషాలు...
ఎంతో మంది మనుషులు పుట్టి చనిపోతుంటారు, కానీ వారిలో కీర్తిశేషులుగా నిలిచేవారు మాత్రం కొందరే. తాము వెళ్ళిపోతూ తమ కీర్తిని ఇక్కడ వదిలివెళ్లిన వారిని కీర్తిశేషులు అంటారు. అటువంటి అరుదైన కీర్తిశేషులలో తూర్పు తక్కెళ్లపాడుకు చెందిన శ్రీమాన్ శ్రీమత్ అద్దంకి తిరుమల శ్రీశైలనాధన్ అయ్యంగార్ ఒకరు. వారు ఏప్రిల్ 28,2021వ తేదీన జనులను విడిచి వైకుంఠానికి చేరుకోగా దానిని పురస్కరించుకొని సరిగ్గా సంవత్సరానికి ఏప్రిల్ 28,2022 వారి శిష్యబృందం చాలా మహోన్నతంగా సంతాపసభ నిర్వహించి వారి జీవితచరిత్ర పుస్తక ఆవిష్కరణ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, వాస్తుశాస్త్ర మేధావి శ్రీమాన్ శ్రేశైలనాధన్ గారిని స్మరించుకుంటూ తూర్పుతక్కెళ్లపాడు గ్రామంలో 28-04-22 తేదీన గురువారం అశేష శిష్య బృందం సమిష్టిగా కలిసి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు హైదరాబాదుకు చెందిన ప్రముఖ సంస్కృత అధ్యాపకులు శ్రీ S.A.T.S ఆచార్య (సింగం ) గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు, ఆయన మాట్లాడుతూ పెద్దఅయ్యగారు తనకు చిన్నాన్నగారని, తమ వంశానికి కీర్తి ప్రతిష్టలు పెంపొందించిన అపర ఆధ్యాత్మిక మేధావి అని, ఈ సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించటం తాను చేసుకున్న అదృష్టం అని అన్నారు.
తొలుత ఈ కార్యక్రమాన్ని ప్రార్ధన మరియు భక్తి గీతాలతో " శ్రీమతి తోట ప్రమీల " ప్రేక్షకుల మదిలో భక్తిభావంనింపారు. ఆ మహనీయుని సభలో తనకు అవకాశం దొరకటం తన అదృష్టమని పెద్ద అయ్యగారి గొప్పతనం గురుంచి తెలిపారు. శ్రీ శ్రీనివాస నృసింహ తాతాచార్యులు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి సీతమ్మగార్లు జ్యోతి ప్రజ్వలన చేసి, శ్రీశైలనాధన్ అయ్యగారి చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సభలో హాజరైన ప్రముఖులతో పాటు, గ్రామ ప్రజలు , శిష్యబృందం పెద్ద అయ్యగారికి ఘన నివాళ్ళు అర్పించారు.
ఈ కార్యక్రమ ముఖ్య అతిధి YSRCP రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ బత్తుల బ్రహ్మానంద రెడ్డిగారు మాట్లాడుతూ తమకు పెద్ద అయ్యగారిని 10 సార్లు స్వయంగా కలిసే భాగ్యం దక్కిందని, తమ బంధువులు ఈ గ్రామంలో ఉండటం వలన తరచుగా వస్తుండేవాడినని అన్నారు, ఇంకా మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులు అయ్యగారి ముహూర్తం , వారి ఆజ్ఞ, దివ్య ఆశీస్సులు తీసుకునే ఏదైనా కార్యక్రమం మొదలుపెడతారని అన్నారు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో అయ్యగారి దేవాలయాల శంకుస్థాపనలు, గుణార్ధనలూ దాదాపు 220 కి పైగా చేశారని వారి యొక్క శాస్త్రియ విధానం చాలా గొప్పదని ప్రజలు చెప్పుకునే వారని అన్నారు, పెద్ద అయ్యగారు మాట్లాడితే పుట్టపర్తి సాయిబాబాలాగా దివ్య తేజస్సు, ఆధ్యాత్మిక భావన కలిగేవని కొనియాడారు. మహోన్నతులైన పెద్దయ్యగారి మార్గంలో చిన్నయ్యగారు కూడా తమ శిష్యులకు చేరువ అవ్వాలని, ఈ పరంపరను కొనసాగించే శక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని బ్రహ్మానందరెడ్డి కోరుకున్నారు.
సంస్మరణ సభలో మాజీ శాసన సభ్యులు శ్రీ బాచిన చెంచు గరటయ్య గారు మాట్లాడుతూ ఎలక్షన్ లో నామినేషన్ ముహూర్తం ఎప్పుడూ శ్రీశైలనాధన్ అయ్యగారే పెట్టే వారని, ఎప్పుడూ గ్రామ అభివృద్ది కోసం పరితపించే వారని తెలియచేసారు. తక్కెళ్లపాడు గ్రామ ప్రజలు త్రాగునీటి సమస్య వల్ల ఇబ్బందులు పడుచుంటే పెద్దయ్యగారి చొరవతో పైలెట్ ప్రాజక్టు నిర్మాణం చేయటం, ఊరికి తమ పొలంలోని చెరువును గ్రామానికి అంకితం చేయటం జరిగిందని అన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కొద్దీ రోజుల తేడాతో వైకుంఠం చేరటం తనను ఎంతగానో ఇబ్బంది పెట్టిందని అన్నారు, అదేవిధంగా సంస్మరణ సభ నిర్వాహకులను చెంచు గారటయ్య గారు అభినందించారు.
భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడారంగ చైర్మన్ శ్రీ పున్నయ్యచౌదరి గారు మాట్లడుతూ ఈ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు క్రికెట్ టోర్నమెంట్స్ కోసం మీ సహాయ సహకారాలు కావాలని పెద్దఅయ్యగారు పంపించారని చెప్పటంతో తానే స్వయం వెళ్లి కలవడం జరిగిందని, వారిని చూసింది మొదలు వారి ముఖంలో దివ్య తేజస్సు తనను భక్తుడుని చేసిందని ఆలా మొదలైన తమ సాన్నిహిత్యం 3- సార్లు క్రికెట్ టోర్నమెంట్ జరుపుకొని, వారికి రేడియో లో వ్యాఖ్యానించే ఏర్పాట్లు చేయటం కూడా జరిగిందన్నారు. పెద్దయ్యగారికి తమ ఊరిపిల్లలకు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని బలమైన కోరిక ఉండేదని కానీ ఎంత ప్రయత్నించినా ఆ పని జరగలేదన్నారు. అయ్యగారి కుటుంబసభ్యులకు తమ కుటుంబసభ్యులకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడి ప్రతి సందర్భం లో వారి దివ్య ఆశీస్సులు పొందటం జరిగిందని అయ్యగారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని పున్నయ్యచౌదరి గారు అన్నారు.
తదుపరి శ్రీశైలనాధన్ అయ్యగారి ముద్దుల మేనల్లుడు రాము మాట్లాడుతూ పెద్ద అయ్యగారు వాస్తు శాస్త్ర, ఆధ్యాత్మిక భావనలతో ఈ గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని సంకల్పించారని అన్నారు. 1985-91 ప్రాంతంలో క్రికెట్ పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు నిర్వహించి మినీ ఈడెన్ గార్డెన్ లాంటి వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారని, రాము అనే ఒక అనామకుడికి "క్రికెట్ రాము" అనే పెద్దపేరు ఇచ్చింది తన మావయ్య గారే అని కొనియాడారు. ఇంకా మాట్లాడుతూ అయ్యగారు ఏది చేప్తే అదే చేసి వారి బాటలో నడిచారని గ్రామస్తులను మెచ్చుకున్నారు. గురువుకు తగ్గ శిష్యుల్లాగా అన్నట్లు అప్పటి SVRCA నుండి ఇప్పటి ఈ సంస్మరణ సభ చేయటం వరకు శిష్యగణం చేసిన కృషి అభినందనీయం అని వ్యాఖ్యానించారు.
తదుపరి "మా అయ్యగారి చరిత్ర "పుస్తక ఆవిష్కరణ జరిగింది. అయ్యగారి ప్రియ శిష్యుడు చరిత్ర విశ్లేషకులు మరియు చరిత్ర ఉపన్యాసకులు శ్రీ తూమాటి వాయునందరావు వివిధ శాసనాలను ఆధారంగా పరిశోధించి శ్రీశైలనాధన్ అయ్యగారి కుటుంబసభ్యుల సహకారంతో అయ్యగారి జీవిత ఘట్టాలను మరియు వారి వంశ పుట్టు పూర్వత్రాలను జోడించి పుస్తకం రచించారు. తక్కెళ్లపాడుకు వెయ్యి ఏళ్ల చరిత్ర అందు అయ్యగారికి 500 ఏళ్ల చరిత్ర ఉందని, వివిధ శాసనాల ఆధారంగా పరిశోధించి ఈ పుస్తకం రాశానని అన్నారు. ఈ పుస్తక రచనలో తోడుగా తన మిత్రుడు సీనియర్ రిపోర్ట్రర్ రాఘవ, అయ్యగారి మేనల్లుడు పెన్నాడ రాము మరియు సుధాకర రెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందించారని, వారి మేలు మరువలేనని వారి సేవలను కొనియాడారు. కొన్ని సంకటస్థితులలో చిన్న అయ్యగారు శ్రీ శ్రీనివాస నృసింహ తాతా చార్యులు గారు ఎంతో సహకరించారని వారికి పుస్తక రచయిత వాయునందనరావు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య ప్రముఖులు శ్రీ బాచిన చెంచు గరటయ్య గారు, శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, శ్రీ డాక్టర్ హృదయనాధ్ గారు, శ్రీ డాక్టర్ రాంబాబు గారు మరియు శ్రీమాన్ శ్రీశ్రీనివాస నృసింహ తాతాచార్యులు గారు పాల్గొని పుస్తక రచయితను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రియ శిష్యులు బోడాల రాఘవ మరియు తూమాటి వాయునందన రావు చిన్న అయ్యగారికి పెద్ద అయ్యగారి దంపతుల మైనపు బొమ్మల జ్ఞాపికను బహుకరించారు.
గొల్లపాలెం గ్రామ ప్రజల భక్తిభావం : నూజండ్ల మండలం, గుంటూరు జిల్లా గొల్లపాలెం గ్రామప్రజలు పెద్దఅయ్యగారు గత సంవత్సరం వైకుంఠయాత్రకు వెళ్లారని తెలిసి, తక్కెళ్ళపాడు అయ్యగారికి జై అని వారి భజనలో మేళతాళాలు మొగుచున్నాయి. గొల్లపాలెం గ్రామప్రజల ఆధ్యాత్మిక భావన కోసం పెద్దయ్యగారే తమ స్వహస్తాలతో సీతారామలక్ష్మణ సమేత హనుమాన్ మందిరం శంకుస్థాపన చేసారని, అప్పటినుండి గ్రామం సుభిక్షంగా ఉందని పెద్దఅయ్యగారిని మరిచిపోలేకపోతున్నామని ఆ గ్రామనివాసి మద్దిరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వారి గ్రామ ప్రజల తరుపున ఘన నివాళ్లు అర్పించారు. చిన్నయ్యగారు గొల్లపాలెం గ్రామ ప్రజలకు పెద్దయ్యగారి దంపతుల ఫోటోను బహుకరించారు.
గ్రామ పరిసర రావినూతల ప్రముఖ వైద్యులు శ్రీ డాక్టర్ హ్రిదయానాధ్ గారు మాట్లాడుతూ 1973 లో ప్రాక్టీస్ పెట్టిన తోలిరోజులనుండి అయ్యగారి తండ్రి గారు శ్రీ సింగరాచార్యులు గారు తన వద్దకు వచ్చేవారని, వారి ఆరోగ్యం నిమిత్తం అప్పట్లో మద్రాసు వెళ్లి వారికి వివిధ టెస్టులు చేయించి తానే స్వయంగా వారి ఆరోగ్యం కుదుటపడాలని ప్రయత్నం చేశానని అన్నారు. పెద్ద అయ్యగారి ఆరోగ్యపరిస్థితి ఎప్పటికప్పుడు డాక్టార్ శంకర్ రావు గారిని అడిగి తెలుసుకునేవాడినని అయ్యగారి ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. అయ్యగారి కుటుంబంలో చిన్నఅయ్యగారితో తమకి ఎక్కువ పరిచయం అని అన్నారు. తక్కెళ్లపాడు,కొప్పెరపాడు గ్రామాలు రెండు తన గ్రామాలే అనుకుంటానని తనను బాగా గౌరవ మర్యాదలతో ఆదరిస్తారని గ్రామస్థులను కొనియాడారు.
తూర్పు కొప్పెరప్పాడు గ్రామానికి చెందిన శ్రీ పొన్నలూరి శ్రీనివాసఫణి గారు మాట్లాడుతూ అయ్యగారి వంశంతో సుదీర్ఘ పరిచయం ఉన్నదని మూడు మరియు నాలుగు తరాల సాన్నిహిత్యం ఉండేదని శ్రీమాన్ శ్రీమత్ అద్దంకి తిరుమల సమయోద్దండ కోలాహల కుమార తాత తిరువేంకట శ్రీశైలనాధన్ అయ్యగార్లు తమకు ఎంతో ఆప్తులని, వారి ముందు తాము ఎంతో భక్తి భావంతో ఉండేవారమని అన్నారు. వారి ముత్తాత గారు 4000 ఎకరాల సంస్థానంలో నెలకు ఐదు రూపాయల జీతం తీసుకోగా తదుపరి వారి తండ్రి గారు నెలకు ముప్పై రూపాయల జీతం తో వారి ఆస్థానంలో పనిచేశారని చెప్పారు. వారి పెద్దలు చెప్పిన ఆధారాల ప్రకారం సింగరకొండపై అయ్యగారి వంశం కోసం లక్ష్మీ నృసింహ స్వామి వెలిశారని , అప్పటినుండి లక్ష్మీనృసింహ స్వామి పీఠం వెలసిందని, తాతాచార్యులు గారు ఆయుర్వేద మందులు నూరుతుంటే రోలు దానికదే నూరుకుంటుంటే అద్దంకి నాంచారు ఔషధాలను నూరుతుండేదని వారి పెద్దలు చెబుతూ ఉండేవారని తెలియచేసారు. మా ముత్తాతలు పొన్నలూరి యలమందయ్య 1870 సం !! నుండి వారి అనంతరం 1917 సం !! మా తాత గారు శ్రీ పొన్నలూరి జానకి రామయ్యగారు వారి సంస్థానంలో పని చేస్తూ వారి యంత్రతంత్ర మహిమలను గూర్తి మా నాన్న గారికి మరియు మాకు తెలియచేశారని వారే అయ్యగారి చరిత్రకు సాక్షులని అన్నారు.
మార్టూరు పట్టణం ప్రముఖ వ్యక్తి సదరన్ డైరీ యం.డి శ్రీ చెరుకూరి సీతారామయ్య గారు మాట్లాడుచూ 1968 లో పెద్దయ్య గారు తమ స్వగ్రామం తాటివారిపాలెం వచ్చారని అప్పటి తమ పరిచయం ఇప్పటి వరకూ కొనసాగిందని అన్నారు. శ్రీశైలనాధన్ అయ్యగారి పేరుమీద వేదపాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానని, చిన్నయ్యగారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు ముందుకు తీసుకెళతానని అన్నారు. గ్రామ స్థాయిలో కొందరు బ్రహ్మజ్ఞానుల ఏర్పాటుకు తానుకూడా శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు.
జిక్కిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన కొండలరావు గారు మాట్లాడుతూ శ్రీశైలనాధన్ అయ్యగారు తనను ముద్దుగా కొండలు అని పిలిచేవారని, అదే నాకు సమాజంలో అసలైన పేరు అయిందని, గుంటూరు ప్రాంతంలో ఏదైనా దేవాలయ ప్రతిష్టలు వస్తే తన ద్వారానే సిఫారసు వెళ్లేదని అన్నారు. ఇంకా మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో తనకు ప్రమాదం జరిగినప్పుడు రెండుగంటలవరకు ఎవరూ తారసపడలేదని వారి దివ్య దర్శనం జరిగి నీకు ఏమి కాలేదు కొండలు అని పలుకరించారని, అప్పటి నుండే వారు దైవ సామానులు అయ్యారని, నేను కూడా వారి శిష్యరికుల జాబితాలో చేరిపోయానని పెద్ద అయ్యగారి మహిమాలగురుంచి కొనియాడారు.
శ్రీశైలనాధన్ అయ్యగారికి ప్రియభక్తుడు గుంటూరుకు చెందిన శ్రీ నేరెళ్ల శ్రీనివాసరావు గారు, గురువుగారు లేరని శోకసంద్రంలో మునిగిపోయి మాట్లాడలేని సందర్భంలో అయ్యగారి మేనల్లుడు S.N.C రాముగారు మాట్లాడుతూ శ్రీను గారు లేకపోతే మనం లేమని పెద్దయ్యగారు తరుచూ చెప్పేవారని, ఏదైనా కార్యం అప్పచెప్తే అయ్యేంత వరకూ దాన్ని సాధించే హనుమంతుడు అని మామయ్య చెప్పేవారని అన్నారు. తూర్పు తక్కెళ్లపాడు లో నేరెళ్ల శ్రీనివాసరావు గారి గురించి ఈ గ్రామంలో తెలియని వారు ఉండరని, ఏ కార్యక్రమం జరిగినా వారి హస్తం ఉంటుందని అన్నారు.
చిలకలూరి పేటకు చెందిన జై ఆంధ్రా హోటల్ సీతయ్య వారి కుమారులు అనిల్ ఎప్పుడు శ్రీశైలనాధన్ అయ్యగారిని అనుసరిస్తూ అయ్యగారి అన్ని విజయాలలో తోడుండే వారని , క్రికెట్ పోటీలు నిర్వహించినప్పుడు ఆటగాళ్లకు ఐదు రూపాయలకే భోజనవసతులు కల్పించి మెప్పు పొందారని అన్నారు. అయ్యగారి చివరి దశలో హాస్పటల్ నందు సహాయపడి సేవచేసిన శిష్యులు పోతిన సంపత్ గారు , సీతయ్య గారు, అనిల్ గారు మరియు గౌసియా గార్లని శిష్యగణం కృతజ్ఞతలు తెలియచేసారు.
ఒంగోలు పట్టణ ప్రముఖ గోల్డ్ మర్చెంట్ బాలు గారు మాట్లాడుతూ తమ జీవితంలో జరిగిన మధురమైన ఘట్టాలను నెమరువేసుకున్నారు. పెద్ద అయ్యగారు, బుల్లెమ్మ గార్లు అద్దంకిలోని తమ సినిమా ధియేటరుకు వచ్చినప్పుడు వారి తాతగారు మొదటి రీలు నుండి మరలా వేయించారని పెద్ద అమ్మగారు చెప్పేవారని అన్నారు. తూర్పు తక్కెళ్లపాడు లో శ్రీరామాలయం ప్రతిష్ట పూర్తి అయ్యేంత వరకు పెద్దఅయ్యగారు ఉన్నట్లయితే బావుండేదని, ఆ కార్యక్రమాన్ని చిన్నయ్యగారి సమక్షంలో పూర్తి చేయటానికి ప్రజలందరూ సమాయత్తం కావాలని అన్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక వేద పండితులు శ్రీ ఆదిత్య గారు మాట్లాడుతూ పెద్ద అయ్యగారు దగ్గర కార్యక్రమాల తంతులో శాస్త్రీయతను నేర్చుకున్నామని, వారి ఆదేశాలతో ఎన్నో ప్రతిష్టలలో పాల్గొని మంచి శిష్యులుగా పేరు తెచ్చుకున్నామని , "మా ఆదిత్య "అని కొందరు ప్రముఖులకు గొప్పగా పెద్దయ్యగారు పరిచయం చేసేవారని అన్నారు. ఇంకా మాట్లాడుతూ అయ్యగారితో తమ సాన్నిహిత్యం గొప్పదని, ఏదైనా పొరపాట్లు చేస్తే సున్నితంగా మందలించకుండా ఓర్పుతో తంతు విధానం గూర్చి తనకు భోధించేవారని పెద్దయ్యగారి సహృదయ గురుంచి కొనియాడారు .
దేవాలయాల శిల్పి శ్రీను మాట్లాడుతూ అయ్యగారు ప్రతి గుడికి శిలల ప్రాముఖ్యత, ప్రాకారాల నిర్మాణం గురించి విశేషంగా భోదించేవారని వారి ఆదేశాల అనుసారం తమ పనిని పూర్తి చేసేవారని. గురువు గారు లేని లోటు మాకు తెలుస్తోందని అన్నారు. ఇంకా అశేష శిష్య బృందం పాల్గొని తమ గురు భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువు గారి పేరుమీద సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి గురువులకు తగ్గ గొప్ప శిష్యులుగా పేరుతెచ్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమాన్ని అద్దంకి పట్టణం కు చెందిన వినాయక స్టూడియో రాము కార్యక్రమాన్ని ప్రసారం చేయగా, ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ అయిన బాబాయ్ మీడియా వారు ప్రత్యక్ష ప్రసారాన్ని చేశారు. ఇంతటి మహోత్తరమైన సంస్మరణ కార్యక్రమం దిగ్విజయంగా జరగటానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకారాలు అందించిన అందరికి శిష్య బృందం కృతజ్ఞతలు తెలియచేసారు.
Share this article in your network!