గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. కోటిపల్లిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో స్వయంగా పడవలో వెళ్లి బాధితులకు బియ్యం, కందిపప్పును మంత్రి వేణుగోపాలకృష్ణ అందించారు. రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో కే గంగవరం మండలంలో పలు లంకలు, కోటిపల్లి ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. లంకలతో పాటు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఇళ్ల మధ్యకు వరద నీరు చేరుకోవడంతో పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో పాటు సమీపంలోనే గౌతమి గోదావరి ఉండటంతో మరో రెండు మూడు రోజులు పాటు ఇబ్బందులు తప్పేలా లేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో మంత్రి వేణు గోపాల కృష్ణ పడవలో వెళ్లి కోటిపల్లిలోని వరద బాధితులకు బియ్యం, పప్పు అందించారు. అత్యవసర మందులు, తాగునీరు, కిరోసిన్ అందుబాటులో ఉంచామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు అందిస్తున్నామని మంత్రి వేణు తెలిపారు.