భూమికి భద్రతే మా ప్రభుత్వ లక్ష్యం.. గత పాలనపై సీఎం చంద్రబాబు ఫైర్

Must read

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన భూ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ భూ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భూమికి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రీ సర్వే, ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో పాటు భూ సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.అంబాజీపేటలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. నీరు జీవం అయితే, భూమి జీవితం అని పేర్కొన్నారు. కోనసీమ ప్రాంతం అనగానే పచ్చని కొబ్బరి చెట్లు, గోదావరి పరవళ్లు గుర్తుకు వస్తాయని అన్నారు. ఎల్‌నినో వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలవడం ఈ జీవనది గొప్పతనానికి నిదర్శనమని సీఎం వ్యాఖ్యానించారు.

పాలన అంటే కేవలం సచివాలయంలో కూర్చోవడం కాదని, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమేనని చంద్రబాబు అన్నారు. తాను ప్రతి నెల నాలుగు సార్లు ప్రజల మధ్యకు వెళ్తున్నానని తెలిపారు. తనతో పాటు ప్రజలు ఎన్నుకున్న ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో అనేక తప్పిదాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. పూర్వీకులు ఇచ్చిన పాస్ పుస్తకాలపై ప్రభుత్వ నేతల ఫొటోలు ముద్రించడం సరికాదని విమర్శించారు. రైతులకు ఉపయోగపడాల్సిన పాస్ పుస్తకాల విషయంలో గతంలో అనుసరించిన విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగించే గ్రానైట్ రాళ్లను పొలాల్లో ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని సీఎం ఆరోపించారు. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారి ఆస్తులకు పూర్తి భద్రత కల్పించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. భూమిపై రైతులకు పూర్తి హక్కు, భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భూ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమానికి తాను ఇప్పటికే తొమ్మిదోసారి హాజరవుతున్నానని తెలిపారు.

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏర్పడిన సమస్యలను సరిదిద్దడానికి తమకు ఏడాదిన్నర సమయం పట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. పాస్ పుస్తకాల పంపిణీలో ఒక్క రూపాయి అవినీతికి కూడా తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ సమస్యలన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు, భూ యజమానులు తమ ఆస్తులకు సంబంధించిన సమస్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భూమికి పూర్తి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.భూ రికార్డుల నిర్వహణ, పాస్ పుస్తకాల పంపిణీ, భూ హక్కుల పరిరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే ప్రభుత్వ పాలనకు ప్రధాన ప్రమాణంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!