13 పేజీల ఫిర్యాదు.. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన కేటీఆర్ బృందం

Must read

తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు రాజ్‌భవన్‌ (లోక్‌ భవన్‌) వరకు చేరాయి. సభ ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బుధవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేసింది.కేటీఆర్ నాయకత్వంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సెప్టెంబర్ 9న మధ్యాహ్నం లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు, సస్పెన్షన్లు తదితర అంశాలను వివరిస్తూ 13 పేజీల సమగ్ర ఫిర్యాదు లేఖను గవర్నర్‌కు అందజేశారు.

సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యూరియా కొరత, రైతు బీమా, ఉద్యోగాల భర్తీ, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీకి బ్లాక్ టీషర్ట్‌లతో వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో నల్ల టీషర్ట్‌లు ధరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాము కూడా నిరసనలో భాగంగా బ్లాక్ టీషర్ట్‌లు ధరించామని చెప్పారు.

అసెంబ్లీ పరిసరాల్లో తమ పార్టీ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని కేటీఆర్ ఆరోపించారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పురుష పోలీసులు గొంతు పట్టుకున్నారని, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగారని ఆయన ఆరోపించారు. తమపై దాడి చేసి, తిరిగి తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.ఇదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న పరిణామాలను కూడా కేటీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారని ఆరోపించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ విమర్శించారు.అసెంబ్లీలో కూడా తమ పార్టీ నేతల వ్యాఖ్యలను వక్రీకరించి స్పీకర్‌కు ఆపాదించారని కేటీఆర్ ఆరోపించారు. సభను గౌరవ సభగా కాకుండా దుష్యాసన సభగా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ బయట జరిగిన ఘటనలపై సీఎస్, డీజీపీని పిలిపించి మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మంచివి కావని గవర్నర్ తమతో అన్నారని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!