తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలను ప్రస్తావిస్తూ.. స్పీకర్‌ను దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని సభ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. శాసనసభ, శాసన మండలి వంటి ప్రజాస్వామ్య వేదికల్లో నైతిక విలువలు, సభా సంప్రదాయాలను ప్రతి సభ్యుడు పాటించాలని సూచించారు.అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలను ప్రస్తావించిన సీతక్క.. మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మహిళా పోలీసులపై అసభ్యంగా చేతులు వేసి నెట్టివేశారని ఆమె ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మహిళా పోలీసులపై చేతులు వేశారని సీతక్క ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.మహిళా పోలీసులపై జరిగిన ఘటనపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని మంత్రి తెలిపారు. అదే సమయంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించి ఉంటే దానిపైనా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం ఎందుకని బీఆర్ఎస్ నేతలను సీతక్క ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన సీతక్క.. ఆ పార్టీకి గిరిజన, దళిత వ్యతిరేక నైజం ఉందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తులు ఎదగడాన్ని బీఆర్ఎస్ సహించలేదని విమర్శించారు. ఇది భూస్వామ్య ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను దూషించిన సందర్భంలో సంబంధిత చట్టాలు వర్తిస్తాయని సీతక్క పేర్కొన్నారు. “వీళ్లకు తల్లులు లేరా.. ఇలా ఎలా తిడతారు?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లులను దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు తమ మాటల్లో సంయమనం పాటించాలని సూచించారు.అసెంబ్లీ వ్యవహారాల్లో గతంలో తీసుకున్న చర్యలను కూడా సీతక్క ప్రస్తావించారు. 2018లో స్పీకర్‌పై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆర్టికల్ 194(3) ప్రయోగించి సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే నిబంధనలను ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారని సీతక్క ఆరోపించారు. నిన్న స్పీకర్‌ను దూషించారని, ఇప్పుడు పోడియం వద్దకు వెళ్లడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. “ఏం.. స్పీకర్‌ను కొడతారా?” అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు.సభలోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం ఒక విషయం అయితే.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మరో విషయమని సీతక్క అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సభలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఇప్పటివరకు స్పీకర్‌కు బీఆర్ఎస్ సభ్యులు క్షమాపణ చెప్పలేదని సీతక్క విమర్శించారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని, జరిగిన ఘటనలపై బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.




